NTV Telugu Site icon

Hyderabad:ఫేక్ సర్టిఫికెట్స్ కేసులో కీలక మలుపు.. ఇద్దరు వీసీలు అరెస్ట్

Certifiket

Certifiket

మనం చూసిన నకిలీ సర్టిఫికెట్ల కేసులన్నింటినీ తలదన్నే కేసు ఇది. ఏకంగా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లరే దొంగ డిగ్రీలు జారీచేసిన సంచలన కేసును హైదరాబాద్‌ పోలీసులు పక్కా ఆధారాలతో ఛేదించారు. దాదాపు మూడు నెలలపాటు అనేక రాష్ర్టాలు తిరిగి పక్కా ఆధారాలు సేకరించి మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీ (ఎస్‌ఆర్‌కేయూ) వైస్‌ చాన్స్‌లర్‌ ఎం ప్రశాంత్ పిళ్లె, ఇదే వర్సిటీకి 2017 నుంచి 2021 వరకు వీసీగా పనిచేసిన ఎస్‌ఎస్‌ కుశ్వాహను అరెస్టుచేశారు. కేసు వివరాలను హైదరాబాద్‌ అదనపు సీపీ (క్రైమ్‌) ఏఆర్‌ శ్రీనివాస్‌ బుధవారం మీడియాకు వెళ్లడించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని మలక్‌పేట, అసిఫ్‌నగర్‌, ముషీరాబాద్‌, చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ల పరిధిలో నకిలీ సర్టిఫికెట్ల కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తు బాధ్యతను నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, సీసీఎస్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సిట్‌ (స్పెషల్‌ అపరేషన్స్‌ టీమ్‌)కు అప్పగించారు. సిట్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందాలు మూడు నెలలుగా భోపాల్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌, చెన్నై, మధురైలోని యూనివర్సిటీల సర్టిఫికెట్ల వివరాలు సేకరించాయి.

హైదరాబాద్‌లోని పలు ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీలు అర్హత లేనివారికి వివిధ వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు అందిస్తున్నాయని, వీటన్నింటికీ మూలం భోపాల్‌లోని ఎస్‌ఆర్‌కేయులో ఉన్నదని గుర్తించారు. పరీక్షలే నిర్వహించకుండా అర్హత లేనివారికి వివిధ డిగ్రీలకు చెందిన 101 సర్టిఫికెట్లు జారీచేసినట్టు కనిపెట్టారు. వాటిలో 13 డిగ్రీలు బీటెక్‌, బీఈలవి కూడా ఉండటం విశేషం. వీటిలో 44 సర్టిఫికెట్లను పోలీసులు సీజ్‌ చేసి కన్సల్టెన్సీల నిర్వాహకులు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, పట్వారి శశిధర్‌, పీకేవీ స్వామి, గుంటి మహేశ్వర్‌రావు, అసిఫ్‌ అలీ, టీ రవికాంత్‌రెడ్డి, ఉప్పరి రంగరాజు, ఎస్‌ఆర్‌కేయు ప్రొఫెసర్‌ కేతన్‌సింగ్‌తోపాటు 19 మంది విద్యార్థులను అరెస్ట్‌ చేశారు.

చివరగా ఈ కుట్రకంతటికీ మూలమైన ఎస్‌ఆర్‌కేయు వర్సిటీ వీసీ, మాజీ వీసీలను మంగళవారం అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఎంతటివారున్నా వదిలేది లేదని సీపీ ఆనంద్‌ హెచ్చరించారు. ఇలాంటి కేసులో వర్సిటీ వీసీని అరెస్టు చేయటం దేశంలో ఇదే మొదటిసారి అని తెలిపారు. సమావేశంలో సిట్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

దేశంలో పేరుగాంచిన వర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎడ్యుకేషనల్‌ అకాడమీలు నడుపుతున్న హనుమకొండకు చెందిన నారెడ్ల రమేశ్‌, దేవరాజు సుధాకర్‌, దాస భిక్షమయ్య రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు తీసుకొని పలువురికి నకిలీ సర్టిఫికెట్లు అందజేసినట్టు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి తెలిపారు.

దేశవ్యాప్తంగా దాదాపు 30 వర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి విద్యార్థులకు అమ్మేశారని చెప్పారు. గంజాయి కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు తెలిసిందని వెల్లడించారు. నిందితుల నుంచి 153 నకిలీ సర్టిఫికెట్లు, రబ్బరు స్టాంపులు, మూడు కంప్యూటర్లు, ఒక ల్యాప్‌టాప్‌, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొన్నట్టు చెప్పారు.

F3: టికెట్ రేట్లపై గుడ్ న్యూస్ చెప్పిన దిల్‌రాజు