Etela Rajender Comments On Moinabad Farm House Issue: మొయినాబాద్ ఫామ్ హౌస్‌తో కేసీఆర్ సరికొత్త నాటకానికి తెరలేపాడని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపణలు చేశారు. ప్రశాంత్ కిశోర్‌ని కేసీఆర్ కలిస్తే.. తెలంగాణను గోల్‌మాల్ చేస్తాడని అనుకున్నామని, ఇప్పుడు అదే జరుగుతోందని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసే సంప్రదాయం కేసీఆర్‌ది అని ధ్వజమెత్తారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఆ పార్టీ కొంప ముంచిన నాయకుడు కేసీఆర్ అని ఆరోపించారు. సీఎంను ప్రశ్నిస్తే మంత్రి పదవి పోతుందని తెలిసి కూడా తాను అడిగానని, మంత్రిగా ఉన్నపుడే టీఆర్ఎస్ పార్టీకి ఓనర్‌ని అని తాను చెప్పానన్నారు. హుజూరబాద్‌లో కేసీఆర్ వేల కోట్లు ఖర్చు పెడితే.. పసుపు బొట్టు తో ప్రమాణాలు చేయించిన హుజురాబాద్ ప్రజలకు ఆయనకు చెంప చెళ్లుమనించారని పేర్కొన్నారు. ఒక చెంప హుజూరాబాద్ ప్రజలు పగలగొడితే.. ఇంకో చెంప పగలగొట్టే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందన్నాడు. 3వ తేదీన మునుగోడు ఆత్మగౌరవం నిలబెట్టుకునెలా ప్రజలు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
అటు.. రాజగోపాల్ రెడ్డి కూడా నలుగురు ఎమ్మెల్యేలను కొంటున్నారని పెద్ద డ్రామా చేశారంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారా,వు గువ్వల బాలరాజుకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. మునుగోడుకి వచ్చి.. ఇక్కడున్న సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీల్ని టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. లీడర్లను కొన్న కేసీఆర్.. మునుగోడు ప్రజల్ని కొనగలడా? లీడర్లు అమ్ముడుపోయారు.. మీరు అమ్ముడుపోతారా? అంటూ మునుగోడు ప్రజల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. తాను రాజీనామా చేయకపోతే.. ఈరోజు మీ ఊర్లకు ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్ వచ్చేవారా? అని నిలదీశారు. తాను రాజీనామా చేసి, మీ కాళ్ళ దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
