Site icon NTV Telugu

Errabelli Dayakar Rao: ఉమామహేశ్వరి చాలా గారాబంగా పెరిగింది.. చిన్న మాట కూడా పడేది కాదు

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

Uma Maheswari Death:
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి తరలివెళ్తున్నారు. మంగళవారం తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారితో పాటు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు ఉమా మహేశ్వరి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి చాలా గారాబంగా పెరిగిందన్నారు. చిన్న మాట అన్నా కూడా ఆమె పడేది కాదని… ఊరికే అలిగేదని ఎర్రబెల్లి చెప్పారు. ఇప్పుడు కూడా మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు చెప్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు. ఆమె మరణం నందమూరి ఫ్యామిలీకి తీరని లోటు అన్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఎర్రబెల్లి అన్నారు. ఎన్టీఆర్ తమకు ఎంతో అభిమానం అని చెప్పారు.

Read Also: Uma Maheswari: ఎల్లుండి ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి అంత్యక్రియలు

అటు టీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారి మాట్లాడుతూ.. ఉమామహేశ్వరి మరణం చాలా బాధాకరం అని.. ఆమె కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈరోజు ఉమా మహేశ్వరికి నివాళులు అర్పించిన వారిలో బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ మొదటి భార్య లక్ష్మీ, నారా లోకేష్, తారకరత్న, ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ఉన్నారు. ఉమా మహేశ్వరి తనకు చిన్ననాటి నుంచి తెలుసు అని.. ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ కనిపించేవారని.. ఆమె హఠాన్మరణం జీర్ణించుకోలేక పోతున్నామని.. ఆమె దంపతులిద్దరూ గతంలో బుర్రిపాలెం కూడా వచ్చారని ఆదిశేషగిరిరావు గుర్తుచేసుకున్నారు.

Exit mobile version