NTV Telugu Site icon

Errabelli Dayakar Rao: ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారు

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao Says Thanks To CM KCR For Increasing Aasara Pensions: మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పెన్షన్‌ని పెంచుతానని మాటిచ్చిన సీఎం కేసీఆర్.. ఆ మాటని నిలబెట్టుకున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయని అన్నారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 3,016 నుంచి రూ.4,016కు పెంచడం పట్ల సీఎం కేసీఆర్‌‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల నుంచే పెరిగిన పెన్షన్లను ఇవ్వనున్నారని చెప్పిన ఆయన.. రాష్ట్రంలో 5,11,656 మంది దివ్యాంగులకు మేలు జరుగనుందని, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున నెలకు 205.48 కోట్లు అందనున్నాయని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు దివ్యాంగులకు కేవలం రూ.500 మాత్రమే పెన్షన్ అందేదని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2022 వరకు 28,81,222 కొత్త పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని.. గత 9 ఏళ్లలో 60 వేల 562 కోట్ల 40 లక్షల రూపాయలను పెన్షన్లుగా అందజేసిందని వివరించారు. సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను రక్షించడానికి, పెరుగుతున్న వయస్సుతో జీవనోపాధిని కోల్పోయిన వారికి ఆర్థిక మద్దతు ఇవ్వడానికి.. కేసీఆర్ సర్కార్ నవంబర్ 2014లో ఆసరా పింఛను పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని చెప్పుకొచ్చారు.

Palvai Sravanthi: మణిపూర్ అల్లకల్లోలంపై ప్రధాని మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు

రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సౌతం.. దివ్యాంగుల పెన్షన్ పెంపుపై సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు. దివ్యాంగుల పెన్షన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన 5,16,890 మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ.3,016 చొప్పున పదేళ్ళలో రూ.10310.36 కోట్లను పెన్షన్ల రూపంలో ఇప్పటివరకు అందించామన్నారు. ఇక ఈ నెల నుంచి రూ.4016 చెల్లించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతంగా అమలు కావడం లేదన్నారు. దివ్యాంగులు అందరితో సమానంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.

Viral News: అయ్యా బాబోయ్.. ఇల్లు కావాలంటే అది ఉండాలా?