Site icon NTV Telugu

Errabelli Dayakar Rao: అవార్డులు వస్తుంటే కాంగ్రెస్, బీజేపీలు రగిలిపోతున్నాయి.

Errabelli

Errabelli

గ్రామాల్లో సర్పంచులు ఆందోళన చేస్తున్నారా..? లేక ఎవరైనా చెప్పి చేయిస్తున్నారా..? తెలియడం లేదని..కొన్ని మీడియా ఛానెళ్లు, వార్తా పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, నిన్నటి వరకు అందరి బిల్లులను క్లియర్ చేశామని వెల్లడించారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పల్లె ప్రగతి ఈ నెల 3 నుంచి 17 వరకు అన్ని గ్రామాల్లో జరుగుతుందని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మంత్రులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

ఉపాధి హామీ పనులు మన రాష్ట్రంలో ఎక్కువగా జరిగాయని పార్లమెంట్ లోనే మంత్రి చెప్పారని గుర్తు చేశారు.. మా దగ్గర ఒక్క రూపాయి కూడా పెండింగ్ లో లేదని, మన రాష్ట్ర వాటా రూ.165 కోట్లు ఎప్పుడో రిలీజ్ చేశాం అని, కేంద్రం నుంచి డబ్బులు రావాలని ఎర్రబెల్లి తెలిపారు. మే 22 వరకు అన్ని బిల్లులు క్లియర్ చేశామని చెప్పారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధిని ఆపకండని మంత్రి సర్పంచులకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు రావడం లేదని అన్నారు.

మొన్న కామారెడ్డిలో సర్పంచ్ ఉపాధి హామీ కూలీకి వెళ్తున్నాడని.. రూ. 3 లక్షల బిల్లు పెండింగ్ లో ఉందని రాశారు. కాగా విచారణ చేపడితే కేవలం రూ. 80 వేలు మాత్రమే ఉందని తెలిసింది. నల్లగొండలో సర్పంచ్ శాంతమ్మకు రూ. 20 లక్షలు అప్పు ఉందని పుస్తెల తాడు అమ్మారని పత్రికల్లో వచ్చింది. విచారణ చేస్తే రూ. 6 లక్షలే పెండింగ్ లో ఉన్నాయని.. అది కూడా ఉపాధి హామీ బిల్లులలే అని మంత్రి దయాకర్ రావు వివరణ ఇచ్చారు.

దేశంలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలకు అవార్డులు ఇస్తే అందులో 19 తెలంగాణకు చెందినవే అని.. ఇది మన పనితనం అని అన్నారు ఎర్రబెల్లి. ఇది జీర్ణించుకోలేని బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ఇలా చేస్తున్నాయంటూ విమర్శించారు. నేను ఎక్కడా సర్పంచుల గురించి మాట్లాడలేదని.. కించపరచలేదని మంత్రి అన్నారు. సర్పంచులకు అన్నీ చేస్తున్నాం అని అన్నారు.

Exit mobile version