Site icon NTV Telugu

Errabelli Dayakar Rao: ఏం అభివృద్ధి చేశావని పాదయాత్ర చేస్తున్నావ్ బండి సంజయ్..?

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao Fires On Bandi Sanjay Over Padayatra: ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏం అభివృద్ధి చేశావని పాదయాత్ర చేపట్టావంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. సోమవారం జనగామ జిల్లాలోని యశ్వంతపూర్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరేసిన తర్వాత మాట్లాడిన ఆయన.. అసలు ఏ ముఖం పెట్టుకొని జిల్లాకి వస్తున్నావంటూ బండి సంజయ్‌ను నిలదీశారు. ఏపీ విభజన చట్టం హామీల్లో భాగంగా వరంగల్‌కు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయాల్లో కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.

బండి సంజయ్ పాదయాత్ర సక్సెస్ కావాలని కోరుకుంటున్నామని తెలిపిన ఎర్రబెల్లి.. అదే సమయంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనుల్ని కూడా ప్రజలని అడిగి తెలుసుకోవాలని సూచించారు. కేసీఆర్ ఏం చేశారనే దానిపై ప్రజలకు అర్థమయ్యేల్లా వాస్తవాల్ని వివరించాలని.. లేకపోతే అడ్డుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని బీజేపీ నెరవేర్చలేదన్నారు. కెసిఆర్ హయాంలో కర్నూలు జిల్లాలన్నీ సస్యశ్యామలంగా మారాయని.. వలసపోయిన రైతులు తిరిగి స్వగ్రామాలకొచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు.

గుజరాత్, మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఆ పార్టీ పెద్ద పీట వేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలల కోసం నివేదికలు పంపిస్తే.. కేంద్రం మొండిచెయ్యి చూపించిందని ఎర్రబెల్లి అన్నారు. బీజేపీ ప్రతినిధులు ఉన్న కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మెడికల్ కళాశాల తెచ్చుకోలేని దద్దమ్మలని ఎద్దేవా చేశారు. గాంధీ లాంటి మహాత్ములు శాంతియుతంగా స్వాతంత్రం తీసుకొస్తే.. బిజెపి ఆ మహనీయుల పేరు లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతోందని చెప్పారు. మతం పేరిట చిచ్చు రగిలిస్తూ బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అనంతరం ఆసుపత్రిలో టీఆర్ఎస్ నాయకుల్ని పరామర్శించిన ఎర్రబెల్లి.. బీజేపీ గుండాలే ఆ దాడికి పాల్పడ్డాడరని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు దేవరుప్పుల వద్ద ఉండగా, బీజేపీ వెంట 500 మంది గుండాలొచ్చారన్నారు. అక్కడ జెండా కార్యక్రమానికి వచ్చిన సతమ్మ అనే మహిళే అందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. పోలీసులు కూడా సరిగ్గా స్పందించలేదని, ఈ విషయంపై తాను డీజీపీకి కంప్లైట్ చేస్తానన్నారు. చివరగా.. ‘బండి సంజయ్, నీ పాదయాత్రం చేసుకుంటే సవ్యంగా చేసుకో.. ఏదో లబ్ది కోసం, సింపతి పొందడం కోసం గుండాలతో తిరిగితే ప్రజలే తిరగబడతారు’ అంటూ హెచ్చరించారు.

Exit mobile version