తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో వరంగల్ పర్యటన, రైతు సంఘర్షణ సభ నేపథ్యంలో నిన్న వరంగల్‌లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ పూర్తిగా శవయాత్ర చేస్తుందని, రేవంత్ కు కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఇచ్చే నాయకులు ఉన్నారా ? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నీకు ఒక అన్నగా చెబుతున్నా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితమేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ లో రేవంత్ జాయిన్ అయిన తరువాత జీరో అయ్యిందని, కాంగ్రెస్ లో సీనియర్ లలో ఒక్కరైనా రేవంత్ మంచోడు అని చెప్పమనండి అంటూ చురకలు అంటించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ చంద్రబాబు ఏజెంట్ గా పనిచేసారని, రేవంత్ నీ భాష మార్చుకో.. రేవంత్ అడుగు పెట్టిన చోట కాంగ్రెస్ ఓటమి పాలు అయ్యిందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ సర్కార్ హయాంలో అసెంబ్లీకి కుండ.. బిందె పట్టుకొచ్చే పరిస్థితి లేదు కదా..? అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతులకు ఏం చేసిందని, రైతుల కోసం పాటుపడింది కేవలం ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని ఆయన అన్నారు.
సిగ్గు లేకుండా ఏదో రైతు ధర్నా చేస్తారట..? కిషన్ రెడ్డి రైస్ మిల్లర్లను ఎఫ్‌సీఐ అధికారులతో విచారణ చేస్తామని అంటున్నారు. మిల్లర్లు రైతుల నుంచి వడ్లు కొనకుండా కిషన్ రెడ్డి భయపెడుతున్నారు అంటూ ఆయన విమర్శించారు. రేవంత్ ఏమో సీబీఐ విచారణ అంటున్నారు. కిషన్ రెడ్డి,రేవంత్ రెడ్డిలు చిల్లర గాళ్ళు అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.