NTV Telugu Site icon

Koyyur Encounter: మావోయిస్టు చరిత్రలో నెత్తుటి జ్ఞాపకం.. కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌కు 23 ఏళ్లు

Koyyur Encounter

Koyyur Encounter

Encounter between police and Naxalites at Koyyur 23 years ago: నక్సలైట్స్ ఉద్యమ చరిత్రలోనే నెత్తుటి జ్ఞాపకంగా నిలిచింది కొయ్యూర్ ఎన్‌కౌంటర్. మావోయిస్టులకు భారీ దెబ్బగా భావిస్తుంటారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ గ్రామం( ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా)వద్ద 1999 డిసెంబర్ 2న పోలీసులు, పీపుల్స్ వార్ దళాల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పీపుల్స్ వార్ ముగ్గురు కీలక నేతలను కోల్పోయింది. అప్పటి కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డ, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి శీలం నరేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రం సంతోష్ రెడ్డిలు నేలకొరిగారు. ఈ ముగ్గురి వీరమరణం మావోయిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.

ఎన్‌కౌంటర్ పై అనుమానాలు:

అయితే ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని ప్రజా సంఘాలు ఆరోపిస్తుంటాయి. బెంగళూర్ నగరంలో వీరు ముగ్గురిని డిసెంబర్ 1న పట్టుకుని చిత్ర హింసలు పెట్టి బూటకపు ఎన్ కౌంటర్ లో పోలీసులు హతమార్చినట్లు పౌరహక్కుల సంఘాలు ఆరోపిస్తుంటాయి. ఈ భారీ ఎన్ కౌంటర్ కు ముందు నక్సలైట్లు 1999 ఏప్రిల్‌ 13న మహదేవపూర్‌ మండలం అన్నారం అడవుల్లో మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావును కాల్చి చంపారు. దీనికి ప్రతిగానే పోలీసులు ఈ ఎన్ కౌంటర్ చేశారని అంటుంటారు.

Read Also: Himanta Biswa Sarma: “లవ్ జీహాద్” వాస్తవం.. దీనికి శ్రద్ధావాకర్ కేసు ఓ ఉదాహరణ..

మావోయిస్టు పార్టీకి బీజం:

ఈ ఎన్ కౌంటర్ తరువాత నక్సలైట్ ఉద్యమంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. వీరి జ్ఞాపకార్థం పీపుల్స్ గెరిల్లా ఆర్మీ(పీజీఏ) ఏర్పడింది. 2000 డిసెంబర్ 2న దీన్ని ఏర్పాటు చేసింది పీపుల్స్ వార్. ప్రతీ ఏటా డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు పీజీఏ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు మావోయిస్టులు. వీరి జ్ఞాపకార్థం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ వద్ద 2004లో మావోయిస్టు పార్టీ భారీ స్థూపాన్ని నిర్మించింది. ఆ తరువాత పీపుల్స్ వార్ గ్రూపులో ఎంసీసీఐ, విప్లవ సమాఖ్య వంటి తదితర నక్సల్ గ్రూపులు విలీనం అయ్యాయి. దీంతో అప్పటి నుంచి పీపుల్స్ వార్ కాస్తా మావోయిస్టు పార్టీగా మారింది. దీంతో పాటు పీపుల్స్ గెరిల్లా ఆర్మీ(పీజీఏ) పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ( పీజీఎల్ఏ)గా మారింది.

Read Also: Maharashtra: తండ్రిపై కోపంతో.. మైనర్ బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య

సరిహద్దుల్లో అలజడి:

తెలంగాణ ప్రాంతంలో మళ్లీ బలపడాలని మావోయిస్టు పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దు జిల్లాలైన భూపాలపల్లి, ములుగులతో పాటు కుమ్రంభీం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అడపాదపా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. పలు సందర్భాల్లో ఈ జిల్లాల్లో మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టు అవుతుంటారు. భూపాలపల్లి జిల్లా పలిమెల, మహాదేవాపూర్, మహాముత్తారం మండలాల్లో మావోయిస్టు కదలికలు ఉన్నాయి. దీంతో పాటు ములుగు జిల్లా ఏటూర్ నాగారం, వాజేడు, వెంకటాపూర్ మండలాలను మావోలు షెల్టర్ జోన్ గా ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం.

ఈ రెండు జిల్లాలను ఆనుకుని మావోయిస్టు ప్రభావిత జిల్లాలు అయిన మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో మళ్లీ ఉద్యమాన్ని విస్తరించే ఆలోచనలో ప్రయత్నాలు చేస్తున్నారు మావోయిస్టులు. ప్రస్తుతం పీజీఎల్ఏ వారోత్సవాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలెర్ట్ నెలకొంది. దీంతో గోదావరి పరివాహక అటవీ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ గ్రామాలు, అంతరాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు నిఘాను పెంచారు.

Show comments