ED Raids: బ్యాంకుల కన్సార్టియంను మోసగించి వందల కోట్ల రూపాయల నిధులను దారిమళ్లించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 నిబంధనల ప్రకారం, ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు శుక్రవారం (23.10.2026) నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి పరిధిలోని మొత్తం 7 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి.
ఎం/ఎస్ కనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేవీపీఎల్) రిజిస్టర్డ్ కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్ల నివాసాలు, అలాగే బ్యాంకు నిధుల మళ్లింపులో మధ్యవర్తులుగా వ్యవహరించిన సంస్థలు, వ్యక్తుల ప్రాంగణాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ – బెంగుళూరు) 2022 డిసెంబర్ 8న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (నం. RC0782022E0005) ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఐపీసీ సెక్షన్లు 120-బి, 420, 468, 471లతో పాటు అవినీతి నిరోధక చట్టం-1988 కింద నమోదైన ఈ కేసును ఆధారం చేసుకుని ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని ఐడీబీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుతం యూబీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడాలతో కూడిన బ్యాంకుల కన్సార్టియంను కనకధార వెంచర్స్ సుమారు రూ. 326.49 కోట్ల మేర మోసగించినట్లు ప్రధాన ఆరోపణ. బ్యాంకులు మంజూరు చేసిన బ్యాంక్ గ్యారెంటీ (బీజీ), లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) రుణ సౌకర్యాలను నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. నకిలీ ఉక్కు కొనుగోలు ఇన్వాయిస్లు, రవాణా పత్రాలను సృష్టించి, బినామీ సంస్థల ద్వారా నిధులను భారీగా దారిమళ్లించారని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, రుణాలిచ్చిన బ్యాంకుల సమాచారం లేకుండా కన్సార్టియం వెలుపల వేర్వేరు బ్యాంకు ఖాతాలను నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి. ఈ సోదాల సందర్భంగా నిధుల మళ్లింపు, లేయరింగ్కు సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, పలు రికార్డులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు స్థిరాస్తులు, పెట్టుబడులను గుర్తించడంతో పాటు కీలక ఆస్తుల వివరాలను నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

