Rain Mud: తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. అయితే గత వారం రోజులుగా కురుస్తున్న వానలు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. పునరావాస కేంద్రాలు, కొండలపైకి, ఇళ్లపై వెళ్లి తల దాచుకున్న బాధితులు ఇళ్లను చూసి చలించిపోయారు. వారం రోజులుగా వరద నీటిలో చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. కొన్ని ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయి గోడలు నిలిచిపోయాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఒండ్రుమట్టి పేరుకుపోయి చెట్లు కూలిపోవడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. మిగిలిన ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రతి గ్రామంలో రోడ్లు ధ్వంసమై బతకలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఇళ్లలోని సామాన్లు కొట్టుకుపోవడంతో భయానక వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Telangana Congress: జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
వరద తగ్గుముఖం పట్టడంతో గ్రామాల ప్రజలు స్వగ్రామాలకు చేరుకుని ఇళ్లను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే విద్యుత్తు సరఫరా ఉన్నా మోటార్లు నీటిలో తడిసి పనిచేయడం లేదని వాపోతున్నారు. ఇంట్లోని విలువైన వస్తువులు తడిసి పనికిరాని స్థితిలో ఉన్నాయని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికీ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా పునరుద్ధరణ కాలేదని, ఆస్తినష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్న మాకు ఇలాంటి ఆపద వస్తే అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని వాపోతున్నారు. ఇళ్లంతా బురద, చెత్తతో నిండిపోయిందని చేతులతో బురదను ఎత్తి ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇంతలా వానలు మొదటి సారి వచ్చాయని అన్నారు. ఇంట్లో బురదల వల్ల దోమలు వ్యాపించి అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుందేమోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంటి మరమ్మతులు, ఇంటిని శుభ్రం చేయడం, వస్తువులను తరలించడం వంటి వాటికి పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇళ్లు కూలిన వారికి ప్రభుత్వం ప్రత్యేక పరిహారం ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు.
TS Rains: తెలంగాణలో వర్ష బీభత్సం.. రికార్డు బద్దలు కొట్టిన వర్షపాతం