హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి సత్తా చాటారు ఈటల.. అయితే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ మధ్య గట్టి పోటీ జరిగినా.. కాంగ్రెస్ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. గత ఎన్నికల్లో ఏకంగా 60 వేలకు పైగా ఓట్లు వస్తే.. ఈ సారి మాత్రం చతికిలపడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ, పీసీసీ చీఫ్.. ఇలా మరికొందరి నేతలపై విమర్శలు పెరిగాయి.. కాగా, ఈ ఫలితాలపై స్పందించిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు.. హుజురాబాద్ ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినవిగా అభివర్ణించారు.
హుజూరాబాద్ ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినవే అన్నారు శ్రీధర్‌బాబు.. ఈ ఎన్నికలు ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ మధ్య జరిగిన ఎన్నికలుగానే చూశారు ప్రజలు.. కానీ, పార్టీల మధ్య జరిగిన ఎన్నికలుగా చూడలేదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరిగాయన్న ఆయన.. ఆ ఎన్నికను అలాగే చూడాలన్నారు. కాగా, ఈటల రాజేందర్‌పై ఆరోపణలు రావడంతో.. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించడం.. ఆ తర్వాత టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.. బీజేపీలో చేరడం జరిగిపోయాయి.. ఇక, ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నికలు అనివార్యం అయిన సంగతి తెలిసిందే.