DOST Seat allotment: తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(DOST) ద్వారా చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు మొదటి విడత సీట్ల కేటాయింపును చేపట్టనున్నారు. దోస్త్ లో వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 78 వేల మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపును చేస్తారు.
Read also: Morning Tips : ఉదయాన్నే లేవాలంటే బద్దకంగా ఉందా.. ఇలా చేయండి
రాష్ట్ర వ్యాప్తంగా దోస్త్ ద్వారా రిజిష్ర్టేషన్లను మే 16 నుంచి ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక లక్షా 5 వేల మంది దోస్త్ ద్వారా రిజిష్ర్టేషన్లు చేసుకున్నారు. వారిలో సుమారు 96 వేల మంది తమ వివరాలతో దరఖాస్తులను అప్‌లోడ్ చేసుకున్నారు. వివరాలను అప్‌లోడ్ చేసిన వారిలో తమకు ఏ కాలేజీలో, ఏ గ్రూపులో సీటు కావాలో పేర్కొంటూ సుమారు 78 వేల మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి నేడు సీట్ల కేటాయింపును చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సీట్ల కేటాయింపును తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, దోస్త్-2023 కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ప్రకటించనున్నారు. 2016 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీలో చేరాలంటే కాలేజీల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లోనే తమకు నచ్చిన గ్రూపులో, నచ్చిన కాలేజీలో చేరడానికి దోస్త్ ను ప్రవేశ పెట్టారు. అయితే విద్యార్థులు ఇంటర్ లో వారు సాధించిన మార్కుల ఆధారంగా రిజిర్వేషన్ల మేరకు వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చిన కాలేజీల్లో సీట్ల కేటాయింపును చేస్తారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపును చేపట్టనున్నారు.