Doli Updated Version: ఏజెన్సీ ఏరియాల్లో, ఎత్తైన కొండ ప్రాంతాల్లో రోగాల బారినపడ్డవారిని, పురిటి నొప్పులతో బాధపడే గర్భిణులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లాలంటే డోలీ మాత్రమే ఏకైక రవాణా సాధనం. సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్ల స్థానికులు వీటిలోనే పేషెంట్లను భుజాలపై మోసుకుంటూ వెళతారు. 50 కిలోలకు పైగా బరువున్న ఒక మనిషిని డోలీలో ఇద్దరు వ్యక్తులు నాలుగైదు కిలో మీటర్ల దూరం తరలించాలన్నా ఎంతో కష్టపడాలి. ఈ కష్టాలు ఓ వ్యక్తిని ఆలోచనలో పడేశాయి. దీంతో.. బాధితుల కోసం ఏదైనా చేయాలని తపించాడు.
ఎట్టకేలకు డోలీ అప్‌డేటెడ్ వెర్షన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాడు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామానికి చెందిన అతని పేరు రేపల్లె షణ్ముఖరావు. అతను డోలీని ఒక కదిలే సాధనంగా రూపొందించాడు. ఈ మేరకు దానికి రెండు చక్రాలను అమర్చాడు. వెనక ఒకటి. ముందు ఒకటి. దీనివల్ల డోలీని భుజాల పైన భారంగా మోయాల్సిన అవసరం ఉండదు. జస్ట్.. భుజాల పైన పెట్టుకొని లేదా చేతులతో పట్టుకొని ముందుకు కదిలితే చాలు. దాని చక్రాలు కూడా ముందుకు సాగుతాయి.
Good News From Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ నుంచి బ్యాడ్ న్యూసే కాదు. గుడ్ న్యూస్ కూడా.
దారి సరిగా ఉంటే ఏ సమస్యా ఉండదు. సాఫీగా గమ్యానికి చేరొచ్చు. ఈ చక్రాల వల్ల డోలీని మోసేవారికి దాదాపు 80 శాతం బరువు తగ్గుతుంది. కానీ.. దారిలో బురద/గుంతలు/నీళ్లు ఉంటే కొంచెం ఇబ్బందే. అలాంటప్పుడు ఆ చక్రాలను వెనక్కి మడవొచ్చు. ఈ సరికొత్త డోలీని తయారుచేయటానికి సుమారు రూ.3500 ఖర్చు అయింది. రేపల్లె షణ్ముఖరావుకు మూడేళ్ల కిందట వచ్చిన ఈ ఆలోచన ఇప్పటికి కార్యరూపం దాల్చింది. ఎంతో మందికి ఉపశమనం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు అతణ్ని ప్రశంసిస్తున్నారు.
గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ అప్‌డేటెడ్ డోలీలో ప్రథమ చికిత్స పరికరాలను(ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను), టార్చ్ లైట్‌కి కావాల్సిన విద్యుత్ కోసం సోలార్ ప్యానెల్‌ని అమర్చొచ్చని రేపల్లె షణ్ముఖరావు పేర్కొన్నాడు. ఇతను గతంలోనూ ఇలాంటి కొత్త పరికరాలకు రూపకల్పన చేసి వార్తల్లో నిలిచాడు. ఎద్దుల బండికి సైతం ఇదే తరహాలో భారం తగ్గించే రోలింగ్ సపోర్ట్ టెక్నిక్‌నే జతచేశాడు. తద్వారా మూగజీవాలకు ఎంతో మేలు చేశాడు. రేపల్లె షణ్ముఖరావు ఒక మెకానిక్. వ్యవసాయానికి వాడే ఆయిల్ ఇంజన్లను, మోటర్లను రిపేర్ చేస్తుంటాడు. మోటర్‌తో పనిచేసే నాగలిని రూపొందించాడు.
స్వల్ప విస్తీర్ణంలో పంటలు పండించేవారికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటోంది. దీంతోపాటు.. మనిషి నడపగలిగే, ఒకే చక్రం ఉన్న, కరెంట్/బ్యాటరీతో పనిచేసే కలుపుతీసే యంత్రాన్ని తయారుచేశాడు. పొలాల్లో పనిచేసేవారికి ఎండ తగలకుండా ఉండే టెంట్-ఆన్-వీల్స్‌కి డిజైన్ చేసి మెప్పించాడు. ఈ మొబైల్ షెడ్ కింద ఒకేసారి దాదాపు 10 నుంచి 15 మంది వరకు ఉండొచ్చు. దీన్ని వెనక్కి లేదా ముందుకు ఎటు కావాలంటే అటు జరుపుకోవచ్చు. మారుమూల పల్లెలో ఉంటూ వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న రేపల్లె షణ్ముఖరావు నిజంగా అభినందనీయుడని చెప్పొచ్చు.