NTV Telugu Site icon

ఆశయంతో వస్తున్నా.. అందరి సహకారం కావాలి..!

తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది.. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ తనయుడు డాక్టర్ వినయ్ కుమార్‌… రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆయన.. అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లో తన మద్దతు దారులతో సమావేశం అయ్యారు. సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే ప్రధాన డిమాండ్‌తో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు వినయ్.. ఈ ఏడా డిసెంబర్‌లో కొత్త పార్టీ పేరును , జెండా, అజెండాను ప్రకటిస్తామంటున్న వినయ్‌ కుమార్.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు.

మొత్తంగా రాజకీయ పార్టీ పెట్టడం ఖాయం అని ప్రకటించారు డాక్టర్ వినయ్ కుమార్.. రాజకీయ ప్రయాణంలోకి నన్ను డాక్టర్ మిత్ర లాగారని గుర్తుచేసుకున్న ఆయన… 2014 జులై 27న మాసాయిపేట రైల్ ప్రమాదం నన్ను కలచివేసిందని తెలిపారు.. ఇక, చదివించటం ప్రభుత్వ బాధ్యత కాదా..? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో స్టాండర్డ్స్‌ కూడా లేవని విమర్శించారు.. తాను చాలా గ్రామాలు తిరిగాను.. ప్రభుత్వ స్కూళ్లలో విద్య సరిగ్గా లేక.. ప్రైవేట్‌ పంపుతున్నారని వెల్లడించారు. విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఫైర్‌ అయ్యారు.. చదివి వేసే ఓటు కాదు.. గుర్తును చూసి ఓటు వేసే వాళ్లను రాజకీయ నాయకులు కోరుకుంటున్నారని.. నేను కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి.. అదే సమయంలో నోటాకు ఓటు వేశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. కొత్త పార్టీ పెట్టకపోయినా.. బీఎస్పీలో చేరి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పనిచేస్తున్నారు.. మరోవైపు.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల కూడా వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించి.. పాదయాత్రను కూడా చేపట్టారు. ఇప్పుడు డాక్టర్ వినయ్‌ కుమార్‌ కూడా పొలిటికల్‌ పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించారు. మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్‌ హాట్‌ టాపిక్‌గా మారిపోతున్నారు.