Site icon NTV Telugu

Gokul Chat and Lumbini Park Bomb Blasts: మరిచిపోలేని పీడకల.. ఇదేరోజు ఉలిక్కిపడిన భాగ్యనగరం

Gokul Chat And Lumbini Park Bomb Blasts

Gokul Chat And Lumbini Park Bomb Blasts

2007 ఆగస్టు 25.. హైదరాబాద్‌ మహానగరంతో పాటు దేశం మొత్తాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన గోకుల్‌ చాట్‌, లుంబిని పార్క్‌ జంట పేలుళ్లకు ఇవాల్టితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. బాంబుల్లో వినియోగించిన ఇనుప ముక్కల ధాటికి వందలాది మంది శరీర అవయవాలు కోల్పోయి జీవచ్ఛవాలుగా మారారు. ఈ దారుణానికి ఇండియన్‌ ముజాహిద్దీన్‌ అనే ఉగ్రవాద సంస్థ పాల్పడింది. ప్రశాంత వాతావరణంలో అలజడి సృష్టించింది. బాంబుల దాడికి ప్రజలు ఇప్పటికి ఆ సంఘటనను మరిచిపోలేని స్థితిలో భయాందోళన చెందుతున్నారు. అప్పటి ఘటన కొందరిని భౌతికంగా దూరంచేస్తే.. మరికొందరిని విగత జీవులుగా మిగిలిపోయేలా చేసింది. కోఠిలోని గోకుల్‌ చాట్‌ బండార్‌ అంటే తెలియనివారు ఉండరు. ఫాస్ట్ ఫుడ్ ప్రియులు చాలా మంది నిత్యం అక్కడికి వస్తుంటారు.

ఇక లుంబిని పార్క్‌ లో లేజర్‌ షో అంటే చాలా ఫేమస్‌. అది చూసేందుకు చాలా మంది ప్రజలు వస్తుంటారు. ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాలనే టార్గెట్‌ చేసిన ఉగ్రవాదులు.. బాంబు దాడులతో దద్దరిల్లేలా చేశారు. పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా బాంబు బ్లాస్ట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జీవచ్ఛవాలుగా మిగిలిపోయారు. ఆ సంఘటన జరిగి నేటికి 15 సంవత్సరాలు అవుతున్నా.. అది తలచుకుంటూ.. కుటుంబంలో కోల్పోయిన వారిని గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. బాంబుల దాడి అనంతరం గోకుల్‌ చాట్‌, లుంబిని పార్క్‌ రెండూ మూసివేశారు. ప్రవేశానికి అనుమతించకుండా కొద్ది రోజుల వరకు బంద్‌ చేశారు. మొదటి పేలుడు లుంబినీ పార్క్ వద్ద రాత్రి గం.7.45 నిమిషాలకు జరగగా, రెండో పేలుడు గం.7.50 నిమిషాలకు గోకుల్ చాట్ వద్ద జరిగింది. దీంతో.. భాగ్యనగర ప్రజలు భయభ్రాంతులతో పరుగులు పెట్టారు. బయటికి రాకుండా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా బాంబ్‌ స్కాండ్‌తో అంతా అలర్ట్‌ చేశారు.

బాంబు బ్లాస్ట్ చేసిన నిందితులను పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేశారు. దీంతో.. ఈ కేసు విచారణ కోసం చర్లపల్లి జైలులో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో.. అన్ని ఆధారాలను పరిశీలించిన స్పెషల్ కోర్టు అనిక్ షఫిక్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి అనే ఉగ్రవాదులను దోషులుగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. వీరికి ఆశ్రయం ఇచ్చిన తారిఖ్ అంజుమాకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈఘటన జరిగి 15 సంవత్సరాలు అవుతున్న.. ఇప్పటికీ మరిచిపోలేని పీడకలే..
CM Jagan Live : Financial Assistance to Handloom Weavers under “YSR Nethanna Nestham” Scheme

Exit mobile version