NTV Telugu Site icon

Dharmapuri Arvind : పసుపు పంటపై.. నేను లేఖ రాసిన స్పందించలేదు..

నిజామాబాద్ మార్కెట్లో ఈ రోజు పసుపు పంటకు క్వింటాల్ కు 10 వేల రూపాయలు ధర పలికిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పడ్డ అకాల, అతి వర్షాలకు పసుపు పంట చాలా వరకు దెబ్బతిన్నదని ఆయన అన్నారు. పంట కుళ్లి పోయిన రైతులు చాలా వరకూ నష్టపోయారని, అలాంటి పంట తక్కువ ధర పలుకుతుందని, అలాంటి రైతులను ఆదుకోవాలని ఇప్పటికే నేను ముఖ్యమంత్రి కి లేఖ రాయడం జరిగింది. కాని ఇంత వరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆయన విమర్శించారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఫసల్ భీమా యోజనను ప్రారంభించిందన్నారు.

కానీ.. తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఈ పథకానికి తన వాటా ప్రీమియం చెల్లించకపోవడంతో ఇప్పుడు రైతులకు తీరని నష్టం జరుగుతోందన్నారు. ప్రీమియం చెల్లించి ఉంటే ఇప్పుడు రైతులకు భీమా కింద నష్టపరిహారం అందేదన్నారు. అలాగే ధర తగ్గినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులను ఆదుకునే అవకాశం ఉన్నా.. కేంద్రం సహకరిస్తామని చెప్పినా ముఖ్యమంత్రి లేఖ రాయకుండా రైతులను కష్టాల పాలు చేస్తున్నడని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కండ్లు తెరిచి రైతులను తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.