DGP Mahender Reddy Retirement: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నేడు పదవీవిరమణ చేయనున్నారు. శనివారం తెలంగాణ పోలీస్ అకాడమీలో మహేందర్ రెడ్డి పదవీ విరమణ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 36 ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కొత్త డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ కు అభినందనలు తెలియజేశారు. అంజనీ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ శాఖ మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. తనకు సర్వీసులో సహకరించిన హోం గార్డులకు, పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
Read Also: Hyderabad New Year Traffic Rules: న్యూ ఇయర్ వేడుకలు.. ట్రాఫిక్ ఆంక్షలు పాటించాల్సిందే
తెలంగాణ ఏర్పడ్డాక శాంతిభద్రతల గురించి అపోహలున్నా.. వాటిని అధిగమించి శాంతియుతంగా ముందుకెళ్తున్నాం అని అన్నారు. ఆపదలో ఉన్నవారికికి పోలీసులున్నారనే నమ్మకాన్ని ఇచ్చామని.. పోలీస్ శాఖలో పనిచెస్తున్న వారి జీతభత్యాలు, సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసులకు 30శాతం అలవెన్సులు, హోమ్ కార్డులకు 20 వేల జీతాన్ని ఇస్తుందని వెల్లడించారు. ఇప్పటికే 27 వేల పోలీసులను రిక్రూట్ చేసుకోగా… త్వరలో మరో 17 వేల మంది పోలీస్ శాఖలో చేరనున్నారని వెల్లడించారు. పోలీస్ శాఖలో టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో కేసులు పరిష్కరించామని.. రానున్న రోజుల్లో నేరాలు డిజిటల్ రూపంలోకి మారుతాయని.. కాబట్టి పోలీసులంతా టెక్నాలజీతో అప్డేట్ అవ్వాలని సూచించారు. విజనరీ దృష్టిలో ఉంచుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్ ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
కొత్త డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ మాట్లాడుతూ.. తనను డీజీపీగా నియమించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభద్రతకు తెలంగాణ పెద్ద పీట వేస్తుందని.. దేశ అభివృద్ధికి తెలంగాణ ఇంజన్ లాంటిదని అన్నారు. పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ తీసుకురావడానికి డీజీపీ మహేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. పోలీస్ వ్యవస్థ లో డీజీపీ మహేందర్ రెడ్డి తీసుకువచ్చిన కొత్త సంస్కరణలు అన్ని కొనసాగిస్తా అని తెలిపారు.
