Danyon IT Technology Booked For Cheating 100 People: మన దేశంలో నిరుద్యోగ సమస్య ఎంతుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఉన్నత విద్యను అభ్యసించినా.. చాలామంది ఉద్యోగాలు లేక తంటాలు పడుతున్నారు. ఎప్పుడైనా తమకూ సరైన అవకాశం రాకపోదా? అంటూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వారినే టార్గెట్ చేస్తూ.. కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. వారి వద్ద నుంచి లక్షలకు లక్షలకు దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీ సైతం అలాంటి మోసానికే పాల్పడింది. ఉద్యోగాలు ఇస్తామంటూ.. నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకొని, చివరికి బోర్డు తిప్పేసింది.
ఆ కంపెనీ పేరు డన్యోన్ ఐటీ టెక్నాలజీ. మాధాపూర్‌లో ఉన్న ఈ కంపెనీ, ఇటీవల ఫేస్‌బుక్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. అది చూసిన నిరుద్యోగులు.. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ కంపెనీ వాళ్లు టెలిఫోన్‌లోనే ఇంటర్వ్యూ చేసి, ఆఫర్ లెటర్ జారీ చేశారు. ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ ఇచ్చిన అనంతరం, ప్రాజెక్ట్ ఇస్తామంటూ నమ్మబలికారు. అంతేకాదు.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ప్యాకేజీ ఇస్తామన్నారు. అయితే.. ట్రైనింగ్ కోసమని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేశారు. ఉద్యోగం వచ్చిన తర్వాత, అంతకుమించి సంపాదించొచ్చు కదా! అని అనుకొని, ఆ కంపెనీ వాళ్లు చెప్పినట్టుగానే వంద మందికి పైగా ఉద్యోగులు రూ. 2 లక్షల ఇచ్చారు.
కట్ చేస్తే.. రోజులు, నెలలు గడుస్తున్నా ఆ కంపెనీ నుంచి స్పందన రాలేదు. ప్రాజెక్ట్ ఇస్తానని చెప్పిన కంపెనీ ప్రతినిధి ప్రతాప్ కట్టమూరి, కాలయాపన చేస్తూ వచ్చాడే కానీ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. అప్పుడు తాము మోసపోయామని బాధితులు గ్రహించారు. దీంతో.. వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పారిపోతున్న ప్రతాప్‌ని పట్టుకొని, మాధాపూర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మోసగాడు ప్రతాప్‌ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.