NTV Telugu Site icon

Dangerous Road @NH 65: ప్రమాదాలకు నిలయంగా NH-65… పట్టించుకోని అధికారులు

Nh65 Road

Nh65 Road

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా తయారైంది హైదరాబాద్-విజయవాడ హైవే పరిస్ధితి. రోడ్డు ప్రమాదాల నివారణకై నాలుగులైన్లుగా రోడ్డు విస్తరించినా ప్రమాదాల సంఖ్య తగ్గలేదు. దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన జాతీయరహాదారి ఎన్ హెచ్ 65 పై ప్రయాణమంటేనే ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్దితి నెలకొంది. రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతున్న ఎన్ హెచ్ 65పై అధికారులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో రెండో స్ధానం, ప్రమాదాల్లో అయిదో స్ధానంలో ఉన్న హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి వరస ప్రమాదాల మూలంగా మృత్యుమార్గంగా మారింది.

గతంలో వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారిని విస్తరించకపోవడం వల్ల రహదారి ఇరుకుగా మారి, గుంతలమయమై వరస ప్రమాదాలు జరిగేవి..కానీ ఇప్పుడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి నాలుగు లైన్లుగా విస్తరించినా వాహనదారుల నుంచి నిత్యం టోల్ రూపేణా లక్షల్లో వసూలు చేస్తున్నా విస్తరణలో లోపాల కారణంగా జాతీయరహాదారి నిత్యం రక్తమోడుతోంది. దీంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. రోజులకు పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మరికొందరు గాయాల పాలై పూర్తి అంగవైకల్యం పొందుతున్నారు.

Read Also: Himanta Biswa Sarma: శ్రద్ధా వాకర్ హత్య “లవ్ జీహాదే”.. బలమైన నాయకుడు లేకుండా ప్రతీ నగరంలో ఓ అఫ్తాబ్

టోల్ రూపేణా ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న సదరు కాంట్రాక్ట్ సంస్ధ… ప్రయాణికుల భద్రతను గాలికొదిలేసింది. దీంతో లెక్కకు మించిన రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నేషనల్ హైవేపై పూర్తి స్దాయిలో సర్వీస్ రొడ్ల నిర్మాణం పూర్తి కాకపొవడం…. అండర్ పాసింగ్ బ్రిడ్జిలు లేకపోవడం… ఇరుకు వంతెనలు… ఓవర్ స్పీడ్… డ్రైవర్లు, ప్రయాణికుల నిర్లక్ష్యంతో ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇంటి నుండి జాతీయరహాదారిపై ప్రయాణానికి వెళ్లిన వ్యక్తి తిరిగి వస్తాడో రాడో తెలియని పరిస్థితి. హైద్రాబాద్ నుండి విజయవాడ వరకు నిమిషానికి పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారుల లెక్కలే చెబుతున్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆందోల్ మైసమ్మ దేవాలయంనుంచి ఏపీ లోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు 181.5 కి.మీ మేర రెండు లేన్లుగా ఉన్న (అప్పటి 9 వ నెంబర్ జాతీయ రహదారి) 65 వ నెంబర్ జాతీయ రహదారిని సుమారు రెండు వేల కోట్లతో పదేళ్ల క్రితం బీఓటీ పద్దతిలో జీఎంఆర్ సంస్ధ నాలుగు లేన్లుగా విస్తరించింది. ఈ విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు నేషనల్ హైవేపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద, కేతపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద మొత్తం మూడు టోల్ ప్లాజాలను జీఎంఆర్ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 2012 నుంచి టోల్ ఫీజ్ వసూళ్లను ప్రారంభించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా విస్తరణ సమయంలో సర్వీస్ రోడ్లు, మౌలికవసతులు కల్పిస్తామన్న హామీ ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయింది.

హైద్రాబాద్- విజయవాడ నేషనల్ హైవే ఎన్ హెచ్ 65ను కేంద్రం ఆరులేన్లుగా మార్చేందుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్లగా ఉన్న హైవేను ఆరు లేన్లుగా త్వరలో మారనుంది. ఇప్పుడున్న రోడ్డుకు కుడివైపు ఒక లేన్, ఎడమవైపు మరో లేన్ నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన భూ సేకరణ 2009లోనే పూర్తి కావడంతో రోడ్డు నిర్మాణ పనులకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని జాతీయ రహదారి విస్తరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరు లేన్ల నిర్మాణంలో అండర్ పాస్ బ్రిడ్జిలు, ప్లై ఓవర్ లు కీలకంగా మారనున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోడ్డుపై వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగం, వంతెనల వద్ద 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు రోడ్డును ఏర్పాటు చేశారు. కాని వాహనదారులు ఇవేవి పట్టించుకోకుండా వంద నుండి 150 స్పీడుతో దూసుకెళ్తుండటం, ఈహైవేపై అండర్ పాస్ బ్రిడ్జిలు రొడ్డు ప్రమాదాలు జరిగే చోట లేకపోవడంతో రోడ్డు దాటే వాహనాలు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. హైవేపై స్పీడ్ గన్ లు ఏర్పాటు చేసి వేగం నియంత్రించాల్సిన హైవే పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

Read Also: ChandraBabu: ‘ఇదేం కర్మ’ అంటున్న చంద్రబాబు

వెహికిల్స్ స్పీడ్ తెలుసుకునేందుకు పోలీస్ ఇంటర్ సెప్టర్ పేరుతో ప్రత్యేకంగా పోలీస్ వాహనం ఏర్పాటు చేసినా హైవేపై ఎక్కడా తిరిగిన పాపాన పోలేదు. ఇక హైవేపై ప్రతి 20 కిలోమీటర్లకు ఓ పోలీస్ పెట్రోలింగ్ వాహనంతో పాటు టోల్ ప్లాజా కు సంబందించిన పెట్రోలింగ్ వాహనం తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు అంబులైన్స్ ను కూడా అందుబాటులో ఉంచాలి. కానీ ఇలాంటి నిబందనలేమీ పట్టించుకోకపోవడంతో రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో క్షతగాత్రులకు వైద్యం అందకపోవడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. హైవేకి ఆనుకొని ఉన్న ప్రతి గ్రామానికి అండర్ పాసింగ్, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్లు తమ జేబులు నింపుకుని ,ఇష్టానుసారంగా రోడ్డు నిర్మాణం చేపట్టారనీ మండిపడుతున్నారు హైవే వెంట ఉన్న గ్రామాల ప్రజలు. కేంద్రప్రభుత్వ నిభందనల ప్రకారం డేంజర్ జోన్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇక బైపాస్ ల వద్ద వాహన దారులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తగు చర్యలు చేపట్టాలి. నిబందనలను బేఖాతర్ చేస్తున్న కాంట్రాక్ట్ సంస్ధ నిర్లక్ష్యంతో నకిరేకల్, నార్కట్ పల్లి, కట్టంగూర్, కోదాడ, మునగాల, చిట్యాల, చౌటుప్పల్ వద్ద రోజుకు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఆరు లేన్ల విస్తరణ సమయంలో దండుమల్కాపురం నుంచి కోదాడ వరకు 17 చోట్ల అండర్ పాస్ బ్రిడ్జీలు, సర్వీస్ రోడ్లు, చౌటుప్పల్, చిట్యాల, కట్టంగూర్ , సూర్యాపేట, జనగాం రోడ్డు వద్ద ప్లై ఓవర్ నిర్మించాలని ప్రతిపాదించారు. కొర్లపాడు, నవాబ్ పేట, పెద్దకాపర్తి యూ జంక్షన్ , మేళ్లచెర్వు ప్లై ఓవర్ , ముకుందాపురం యూ టర్న్ , ఆకుపాముల బైపాస్ , కట్టంగూర్ -నల్లగొండ క్రాస్ రోడ్డు, కట్టంగూర్ లోకల్ , నల్లబండగూడెం వద్ద రామాపురం క్రాస్ రెడ్డు, సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్, కోదాడ కట్టకొమ్మగూడెం క్రాస్ రోడ్డు, శ్రీరంగాపురం, దురాజ్ పల్లి క్రాస్ రోడ్డు, కొమరబండ క్రాస్ రోడ్డు వంటి చోట్ల అండర్ పాస్ బ్రిడ్జీలు, సర్వీస్ రోడ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆరు లేన్ల విస్తరణ కంటే ముందే ప్రమాదాల నివారణ కోసం కాంట్రాక్ట్ సంస్ధ వెంటనే అండర్ పాస్ లు, సర్వీస్ రోడ్లతో పాటు సూచీ బోర్డులను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు స్ధానికులు. వరస ప్రమాదాల నేపధ్యంలో నేషనల్ హైవే ఆధారీటీ టోల్ నిర్వాహకులతో కూడా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని.. బ్లాక్ స్పాట్స్ గర్తించి ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.