Damodara Raja Narasimha : రాష్ట్ర మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ, మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యమహిళ క్లినిక్స్ ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ క్లినిక్‌లలో అవసరమైన అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయించడంతో పాటు, చికిత్స మరియు మెడిసిన్ కూడా అందజేస్తున్నామని వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే 2012-13లో ప్రారంభమైన మాతా-శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి, గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేన్సర్ కేసులు, ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న బ్రెస్ట్ కేన్సర్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రవ్యాప్తంగా డే కేర్ కేన్సర్ సెంటర్ల ద్వారా స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. అలాగే ఎన్‌సీడీ క్లినిక్స్ ద్వారా బీపీ, షుగర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్ కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్య రంగంలోనే కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ పథకాల అమలులో కూడా మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వస్థ్ నారీ సశక్త్ అభియాన్’ కార్యక్రమానికి మంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మహిళల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సేవలను మహిళలు తప్పక వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
