NTV Telugu Site icon

TS Dalit Bandhu: గాంధీ జయంతి రోజే దళితబంధు.. ప్రారంభించనున్న కేటీఆర్

Dalith Bandu

Dalith Bandu

TS Dalit Bandhu: బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు ఇప్పటికే ఉన్న పథకాలను లబ్ధిదారులకు మరింత చేరువ చేయడమే హ్యాట్రిక్ సక్సెస్ లక్ష్యం. వెనుకబడిన దళితులకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేందుకు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారు. మొదటి దశలో ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం, రెండో విడత పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున దళిత బంధు రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 162 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయనున్నారు. మొదటి విడత పంపిణీలో అవకతవకలు జరిగాయని విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, వారి అనుచరులు భారీగా కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రెండో విడతలో భాగంగా అర్హుల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఒక్కో నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణలోని 72 నియోజకవర్గాల్లో 50 వేల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఆమోదం పొందిన అభ్యర్థుల జాబితాను ఎస్సీ కార్పొరేషన్‌కు పంపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మొదటి దశలో 38,323 కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేశారు. అందుకోసం 4,441.80 కోట్లు వెచ్చించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల విలువైన యూనిట్లు మంజూరయ్యాయి. రెండో దశలో నియోజకవర్గానికి 1100 మంది చొప్పున హుజూరాబాద్ మినహా 1,30,000 కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 72 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. లబ్ధిదారుల జాబితాలను త్వరితగతిన ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి చేరవేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Harish Rao vs Perni Nani: తెలంగాణ మంత్రి హరీష్ రావు పై.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు