NTV Telugu Site icon

స్కూల్‌ ఫ్రెండ్‌ను అంటూ పరిచయం.. గిఫ్ట్‌ల పేరుతో భారీ మోసం

Cyber fraud

Cyber fraud

సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు.. ఏది చెబితే అవతలి వ్యక్తి బుట్టలో పడతాడో.. మరీ గెస్‌చేసి ఊబిలోకి లాగేస్తున్నారు.. ఆ తర్వాత అందినకాడికి దండుకుంటున్నారు.. తాజాగా హైదరాబాద్‌లో స్కూల్‌ ఫ్రెండ్‌ను అంటూ ఏకంగా రూ.14 లక్షలు మోసం చేశారు సైబర్‌ నేరగాళ్లు.. దీనికి సోషల్‌ మీడియాను వాడుకున్నారు.. ఇన్‌స్టాగ్రామ్‌ లో స్కూల్‌ ఫ్రెండ్‌ని అంటూ హైదరాబాద్‌కు చెందిన మహిళతో పరిచయం చేసుకున్న.. కేటుగాడు.. మీకు గిఫ్ట్‌లు పంపిస్తానంటూ నమ్మబలికాడు.. ల్యాప్‌టాప్‌, విలువైన గిఫ్ట్స్, డాలర్స్ పంపిస్తున్నానంటూ ఆమెను నమ్మించారు సైబర్ చీటర్స్.

మహిళ వారిని పూర్తిగా నమ్మేసరికి.. తమ ప్లాన్‌ అమలు చేశారు కేటుగాళ్లు.. తాము ఎయిర్‌పోర్ట్‌ అధికారులమంటూ కాల్‌ చేశారు.. మీకు విలువైన వస్తువులు వచ్చాయని.. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాయని.. అయితే, కస్టమ్స్, జీఎస్టీ, ఇతర చార్జీలకు డబ్బులు కావాలని తెలిపారు.. అలా సదరు మహిళ నుంచి ఏకంగా రూ. 14 లక్షలు లాగేశారు.. ఇంకేముంది.. తర్వాత ఫోన్‌ కలవదు.. స్కూల్‌ ఫ్రెండ్‌ స్పందించడు.. దీంతో.. మోసపోయానని నిర్ధారణకు వచ్చిన మహిళ.. లబోధిమో మంటూ.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.