NTV Telugu Site icon

రెండో పెళ్లి పేరుతో భారీ మోసం

హైదరాబాద్ నగరంలో ఓ సైబర్ నేరగాడు రెండో పెళ్లి పేరుతో యాభై లక్షల రూపాయలను కాజేసాడు. భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీ‌లో జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ రిజిస్టర్ చేసుకుంది. ఇటలీలో తాను డాక్టర్‌నని, ఇక్కడే క్లినిక్ ఉందని, మాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ చూశానని ఆ మహిళను కేటుగాడు నమ్మించాడు. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లోనే స్థిరపడదామని ఆ మహిళను కేటుగాడు ముగ్గులోకి లాగాడు. ఇటలీలో ఉన్న తన ఖరీదైన వస్తువులను ఎయిర్ కొరియర్ ద్వారా పంపిస్తున్నానని ఆ మహిళను నమ్మించాడు. ఒక మహిళ చేత ఢిల్లీ కస్టమ్స్ అధికారినంటూ ఫోన్ చేయించి ట్యాక్సుల చెల్లింపు పేరుతో తాను చెప్పిన అకౌంట్‌కు యాభై లక్షల రూపాయలను కేటుగాడు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. తరువాత ఆ కేటుగాడి నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో తాను మోసపోయానని ఆ మహిళ గ్రహించింది. దీంతో తనకు జరిగిన మోసంపై సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది.