దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. మేడారం సమ్మక్క-సారక్క జాతరను పురస్కరించుకొని భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడలో శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అంతేకాకుండా బద్దిపోచమ్మకు ఎంతో భక్తిశ్రద్దలతో, అంగరంగ వైభవంగా శివసత్తుల నృత్యాల నడుమ బోనాలు అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో నేడు.. వేములవాడ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
దీంతో బద్ది పోచమ్మ ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అంతేకాకుండా నేడు మాఘ అమావాస్య సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి వారి జాతర ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎంతో వైభవోపేతంగా జరుగనుంది. వేములవాడ రాజన్న దత్తత ఆలయం కావడంతో మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి జాతర ఏర్పాట్లు రాజన్న దేవస్థానం ఆధ్వరంలోనే జరుగుతాయి. అయితే మామిడిపల్లి జాతరకు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
