NTV Telugu Site icon

CPI Narayana: బాసర ట్రిపుల్ ఐటీలో నిర్బంధకాండ కొనసాగుతోంది

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana: బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు సమ్మెలోకి వెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 6 వేల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో చదువుతున్నారని ఆయన తెలిపారు. యూనివర్సిటీని పోలీసులు క్యాంపుగా మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాఫ్ లేదు, ల్యాప్‌టాప్‌లు లేవని, మెస్ సైతం సరిగ్గా లేదన్నారు. ఆహారం వికటించి ఈ మధ్య పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. వసతిగృహ కాంట్రాక్టులో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు, స్థానిక నేతలకు, ఎమ్మెల్యేలకు వాటా ఉందని ఆయన ఆరోపించారు. మంత్రి సబిత పర్యటించినా కూడా లాభం లేదన్నారు. తాను రెండు సార్లు వెళ్లినా రానివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో.. మంత్రి కేటీఆర్ బెడ్‌పై ఉన్నారని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీలో నిర్బంధకాండ కొనసాగుతోందన్నారు. సరైన చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

Sabitha Indrareddy : మంత్రి సబిత నివాసం ముందు ఐఐఐటీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీపీఐ సీనియర్ నేత నారాయణ బాసర ట్రిపుల్ విద్యార్థుల సమస్యల గురించి లేఖ రాశారు. ఆ లేఖలో వారి సమస్యలను వివరించారు. ఈ యూనివర్సిటీకి ఇప్పటికీ రెగ్యులర్ వైస్-ఛాన్సలర్ లేకపోవడం విస్మయకరమని… వెంటనే నియమించాలని కోరారు. వసతిగృహానికి సంబంధించి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టులు ఇవ్వబడ్డాయని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. హాస్టల్ నిర్వహణ యూనివర్సిటీ చేతుల్లోనే ఉండాలని విద్యార్థులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులందరికీ తాజా కాన్ఫిగరేషన్‌తో కూడిన ల్యాప్‌టాప్‌లు తప్పనిసరిగా ఇవ్వాలని కోరారు. 200కి పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని.. అన్ని తరగతులు మరియు ప్రాక్టికల్‌లు జరిగేలా పర్మినెంట్ టీచర్లను వెంటనే నియమించాలన్నారు. లైబ్రరీని అప్‌గ్రేడ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.