NTV Telugu Site icon

CP CV Anand: ఒక మేజర్.. ఐదుగురు మైనర్లు.. ఇదీ అసలు కథ

Cv Anand

Cv Anand

హైదరాబాద్ నగరంలో సంచనలం రేపిన జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో లోతుగా దర్యాప్తు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని, వీరిలో ఒక్కరే మేజర్ అని తెలిపారు. కేసులో ఐదుగురు మైనర్లు ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పేర్లు వెల్లడించడం లేదన్నారు. వారందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశామన్నారు. అయితే ఆరో వ్యక్తి బాధితురాలిపై రేప్ చేయలేదన్నారు. రేప్ చేసిన నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష లేదంటే జీవిత ఖైదు విధించే అవకాశం ఉందన్నారు. కేసుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. రేప్ కేసులో బాధితురాలు నిందితులను గుర్తించలేకపోతోందని అన్నారు. ఒకరిని తప్ప మిగతా వారిని గుర్తుపట్టలేదన్నారు. సరైన ఆధారాలు లేకపోవడం వల్లే నిందితులను అదుపులోకి తీసుకోవడంలో ఆలస్యమైందన్నారు. కోర్టుకు తాము పూర్తి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని సీపీ చెప్పారు. సీసీ ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.

LIVE: అమ్నీషియా పబ్‌ రేప్ కేసుపై సీపీ సీవీ ఆనంద్ ప్రెస్‌మీట్

మే 28న ఘటన జరిగిందని.. మే 31 వరకు బాధితురాలు పేరెంట్స్‌కు చెప్పలేదని.. మే 31న జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైనట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మే 28న మధ్యాహ్నం 1:10 గంటలకు బాధితురాలు, ఆమె స్నేహితుడు 1:50 గంటల వరకు పబ్‌లో ఉన్నారని.. అనంతరం ఆమె స్నేహితుడు పబ్ నుంచి బయటకు వెళ్లాడని.. అయితే మరో స్నేహితురాలు బాధితురాలిని కలిసినట్లు సీపీ వివరించారు. అదే సమయంలో మైనర్ నిందితుడితో పాటు సాదుద్దీన్ బాధితురాలి దగ్గరకు వెళ్లారని.. వాళ్లు పబ్‌లోనే అసభ్యంగా ప్రవర్తించారని సీపీ పేర్కొన్నారు. వీళ్లు పబ్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయటకు వచ్చారని.. బాధితురాలి స్నేహితురాలు పబ్‌లో నుంచి వెళ్లి క్యాబ్ బుక్ చేసుకుందని చెప్పారు. పబ్ నుండి బయటకు రాగానే బాధితురాలిని ఎక్కించుకుని నిందితులంతా కాన్సు బేకరీకి బయలుదేరారని తెలిపారు. మధ్యలో బాలికను ముద్దులు పెట్టుకుంటూ వీడియోలు తీసుకున్నారని.. తర్వాత రోడ్డునం.44లోని పెద్దమ్మ టెంపుల్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో ఒకరి తరువాత ఒకరు అమ్మాయిని బలవంతం చేశారన్నారు. రాత్రి 7:15 గంటలకు బాధితురాలిని మళ్లీ పబ్ వద్ద దింపారన్నారు. 376(d) 323 పోక్సో, 5g(6), 366(a), ఐటీ యాక్ట్ 67 కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీపీ వివరించారు.

నిందితులు ట్రాప్ చేయడంతో బాలిక వారిని నమ్మి వెళ్లిందని సీపీ ఆనంద్ చెప్పారు. కొందరు అమ్మాయిలు ఇలాంటివి గుర్తించలేరని, బాధితురాలితో ఉన్న మరో అమ్మాయి నిందితుల దురాలోచనను పసిగట్టి క్యాబ్‌లో వెళ్లిపోయిందని తెలిపారు. కానీ ఈ అమ్మాయి వారితో వెళ్లి అత్యాచారానికి గురైందన్నారు. గ్యాంగ్ రేప్ కేసులో హోంమంత్రి మనవడు ఉన్నట్లు వస్తున్న వార్తలు కేవలం ఆరోపణలేనని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. దర్యాప్తులో తమకు అలాంటి క్లూ లభించలేదన్నారు. ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని, తప్పకుండా విచారణ చేస్తామని సీపీ వెల్లడించారు.