కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అంతా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కూడా కరోనా వైరస్ సోకింది.. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్‌లు చేయించుకున్నారు.. అయితే, ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి.. కానీ, అప్పటి నుంచి ఆయన వ్యవసాయ క్షేత్రంలో హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.. జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెట్టడంతో.. రెండో రోజుల క్రితం మరోసారి కోవిడ్ పరీక్షలు చేయించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని జనసేన పార్టీ పేర్కొంది.
ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్.. హైదరాబాద్‌కు వచ్చి పవన్ కల్యాణ్‌కు చికిత్స ప్రారంభించారని.. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారని.. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో.. యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారని.. అవసరం అయినప్పుడు ఆక్సిజన్ కూడా పెడుతున్నారని జనసేన తన ప్రకటనలో పేర్కొంది. ఇక, చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారని.. అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని.. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్ కల్యాణ్‌ను పరీక్షించింది.. జ్వరం, ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు.. తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది జనసేన పార్టీ.