తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళపై పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కౌంటరిచ్చారు టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ గారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలపడం కాదన్నారు కవిత.
ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయాలని సలహా ఇచ్చారు. ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత.
ఇదిలా వుంటే తమ అధినేత రాహుల్ గాంధీపై కవిత చేసిన ట్వీట్ కి కౌంటరిచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కవిత గారూ…టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు… సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!? అంటూ ట్వీట్ చేశారు రేవంత్.
మొత్తం మీద టీఆర్ఎస్ బీజేపీ గా వున్న వరియుద్ధంలో కొత్త ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఇప్పుడది కాంగ్రెస్ టీఆర్ఎస్ గా మారిందని చెప్పాలి.
