కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీనేతలు మండిపడుతూనే వున్నారు. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు చేశారు. కానీ మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోకపోవడంతో ధర్నా, ఆందోళనలకు దిగింది. ఇవాళ పోలీస్ కమిషనరేట్ల ముందు, ఎస్పీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ధర్నాలు చేయనుంది.
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయనందుకు నిరసనగా పోలీస్ కమీషనరేట్స్ ముందు ఎస్పీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ధర్నాలు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. హైదరాబాద్ కమిషనరేట్ వద్ద తాను, రాచకొండ కమిషనరేట్ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొంటారని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఉదయం 11 గంటలకు నిజాం కాలేజి గ్రౌండ్స్ నుంచి కమిషనరేట్ వరకు ప్రదర్శన అక్కడ ధర్నా.. ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ గారిపైన అస్సాం సీఎం హిమంత్ బిస్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలని ఆధారాలతో సహా కాంగ్రెస్ శ్రేణులు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 709 పోలీస్ స్టేషన్లలో ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ జూబ్లిహిల్స్ లో తప్ప మిగలిన ఏ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయలేదు. అందుకు నిరసనగా డీసీసీల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయాల ముందు.. నగరాలలో పోలీస్ కమిషనరేట్ల ముందు భారీ ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క నాయకులు ఈ ధర్నాలో పాల్గొని అస్సాం సీఎం పైన కేసు నమోదు అయ్యే వరకు పోరాటం చెయ్యాలన్నారు.కాంగ్రెస్ పిలుపుతో సీపీ ఆఫీస్, నిజాం కాలేజి, బషీర్ బాగ్ చౌరస్తాలలో భారీగా బలగాలు మోహరించారు.
