NTV Telugu Site icon

Komatireddy: కొబ్బరికాయ కొట్టించిన కేసీఆర్‌.. ప్రశంసలు కురిపించిన కోమటిరెడ్డి..!

జనగామ కలెక్టరేట్‌ భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది… కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేతికి కొబ్బరికాయ అందించారు పూజారి.. ఆ వెంటనే.. తన పక్కనే ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి కొబ్బరికాయ ఇచ్చిన కేసీఆర్.. కొట్టాల్సిందిగా సూచించారు.. మొదట నిరాకరించినట్టుగానే కనిపించిన ఆయన.. మీరే కొట్టాలని కోరగా.. మరోసారి సీఎం సూచన చేయడంతో.. వెంటనే టెంకాయను కొట్టేశారు కోమటిరెడ్డి..

Read Also: KCR: ఉద్యోగులకు సీఎం గుడ్‌న్యూస్‌.. జీతాలు ఇంకా పెరుగుతాయి..!

ఇక, ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు ఎంపీ కోమటిరెడ్డి.. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటన్న ఆయన.. తెలంగాణలో 33 జిల్లాలు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.. కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ కలెక్టరేట్లలా కూడా సచివాలయాలు లేవని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన కోమటిరెడ్డి… ఆదాయం లేకున్నా రెండేళ్లుగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని ప్రశంసించారు.. తెలంగాణ వచ్చింది.. ఇక, మనం మనం కొట్టాడుకోవద్దు.. తెలంగాణలో రాజకీయ నాయకుల మధ్య ఘర్షణలు వద్దు అని సూచించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కాగా, ఏ విషయంలోనైనా తెలంగాణ సర్కార్‌, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసే.. కోమటిరెడ్డి.. ఒక్కసారిగా ఇలా ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది.