NTV Telugu Site icon

Jagga Reddy: పూర్తిగా మారిపోయిన జగ్గారెడ్డి.. గుర్తు పట్టడం కూడా కష్టమే..!

Jagga Reddy

Jagga Reddy

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి పేరు వినగానే.. పెద్ద వెంట్రుకలు, గుబూరు గడ్డమే గుర్తుకు వస్తుంది.. ఆయన రాజకీయాలపై గంభీరంగా ఎంత ముక్కుసూటిగా మాట్లాడతారో.. ఆయన ఎయిర్‌ స్టైల్‌, గడ్డం, నడక తీరు కూడా అంతే గంభీరంగా ఉంటాయి.. జగ్గారెడ్డిని గడ్డం లేకుండా.. పొడవాటి వెంట్రుకలు లేకుండా చూసింది చాలా అరుదనే చెప్పాలి.. ఎన్నికలకు ముందు.. ఫలితాల తర్వాత ఇలా ఎప్పుడూ.. ఆయన ఇదే గెటప్‌తో కనబడుతుంటారు.. అయితే, ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయారు.. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.. దీంతో.. జగ్గారెడ్డిని చూసిన వారు గుర్తు పట్టలేని పరిస్థితి.. వెంట్రుకలు, గడ్డం తీసియేడంతో.. అసలు ఆయన జగ్గారెడ్డియేనా? అని పరిశీలనగా చూడాల్సిన పరిస్థితి.

Read Also: Gudivada Amarnath: ప్రధాని మోడీ-పవన్‌ భేటీపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వారికి ఓట్లు, సీట్లు రెండూ లేవు..!

కాగా, జగ్గారెడ్డికి దైవ భక్తి ఎక్కువ.. తరచూ ఆయన నియోజకవర్గంలో పూజల్లో పాల్గొంటారు.. చిడతలు వాయిస్తారు.. డోలక్‌ కొడతారు.. మద్దెల దరువుకు కాలు కదుపుతారు.. ఇక, ఆయన భక్తి పారశంతో పాట అందుకున్నారంటే.. అందరూ కోరస్‌ ఇవ్వాల్సిందే.. ఈ మధ్య తన నియోజకవర్గంలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర సమయంలో.. ఆయన పోతు రాజులను అనుకరించిన విషయం తెలిసిందే.. అంతే కాదు.. పూజలు, వినాయక చవితి, నవరాత్రుల సమయంలో.. చందాల కోసం జగ్గారెడ్డి దగ్గరకు వచ్చేవారి సంఖ్య భారీగానే ఉంటుందట.. ఆయన తనకు తోచిన సాయం భక్తులకు చేస్తూనే ఉంటారని చెబుతుంటారు. ఇక, ఎప్పుడూ ఏదో మొక్కుతో ఆయన వెంట్రుకలు, గడ్డం పెంచుతూనే ఉంటారు.. మరి, ఆయన శ్రీవారికి మొక్కిన మొక్కు ఏంటో.. ఆయన కోరిక తీరడంతోనే శ్రీ వేంకటేశ్వరస్వామికి మొక్కు చెల్లించుకున్నారేమో తెలియదు.. కానీ, జగ్గారెడ్డి కొత్త ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.