NTV Telugu Site icon

ఇక గేమ్‌ స్టార్ట్.. వచ్చే ఎన్నికల్లో గెలిచే వ్యూహంలోనే ఉంటాం..!

ఎన్నికల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు సర్వ సాధారణమైన విషయం.. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఛాలెంజ్‌ చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. తన పంతం నెగ్గించుకున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని గతంలో సవాల్ చేసిన ఆయన.. ఈ రోజు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు రావడంతో తన పంతం నెగ్గించుకున్నారు.. జగ్గారెడ్డి ఛాలెంజ్ చేసిన దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీకి అదనంగా 8 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయితే, ఎన్నికల ఫలితాలపై స్పందించిన జగ్గారెడ్డి.. ఇక గేమ్‌ స్టార్ట్‌.. వచ్చే ఎన్నికల్లో విజయం లక్ష్యంగా వ్యూహాలు ఉంటాయన్నారు.. మెదక్‌లో నైతికంగా గెలిచింది కాంగ్రెస్‌ పార్టీయేనన్న ఆయన.. జిల్లా నాయకత్వం సహకారంతోనే ఇది సాధ్యం అయ్యిందన్నారు.. మా ఓట్లు మేం వేసుకోవాలని అభ్యర్థిని పెట్టాం.. మాకు ఉన్న 230 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి అంటేనే మేం విజయం సాధించినట్టు అన్నారు.. అదనంగా వచ్చిన ఓట్లు ఎవరివి అనేది మాకు తెలియదన్న ఆయన.. ట్రబుల్స్ షూటర్ హరీష్ ని ట్రబుల్స్ లో పడేశాం అన్నారు..

Read Also: నూతన జోనల్‌ విధానం.. ఉద్యోగుల కేటాయింపుపై స్టేకు హైకోర్టు నిరాకరణ..

స్థానిక ప్రజా ప్రతినిధులు మాకు ఎన్నో మాటలు చెప్పారు.. మాకు నిధులు లేవు.. కూర్చునేందుకు కుర్చీ లేదు అన్నారు.. పోరాటం చేసేందుకే అభ్యర్థిని పెట్టాం.. కానీ, ఓట్లు ఎందుకు వేయలేదో తెలియదన్నారు జగ్గారెడ్డి.. పోరాటం చేయండి అని చెప్పి… ఓటేయక పోతే ఏం చేస్తామన్న ఆయన.. 230 కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజీనామా చేస్తా అని చెప్పిన.. నా మాటలకు విలువ ఇచ్చి ఓటేసిన మా పార్టీ ఓటర్లకు ధన్యవాదాలు అన్నారు.. ఇక్కడి నుండి గేమ్ స్టార్ట్.. వ్యూహాత్మకంగానే ఎన్నికల్లో పాల్గొన్నాం.. వచ్చే ఎన్నికల్లో 8 సీట్లు ఎలా గెలుచుకోవాలి అనే వ్యూహంలోనే ఉంటాం.. అందరం కలిసి పని చేస్తాం అన్నారు జగ్గారెడ్డి. ఇక, ఎన్నికల్లో నేను ప్రలోభాలు పెట్టిఉంటే 400 ఓట్లు వచ్చేవన్న ఆయన.. మేం దమ్మున్నవాళ్ల.. క్యాంప్ పెట్టకుండా మా ఓటు మాకు వేసుకున్నాం అన్నారు.. మేం మాట మనుషులం.. అందుకే తక్కువ ఓట్లు వస్తే రాజీనామా చేస్తామని అన్నామని గుర్తుచేసిన ఆయన.. గాంధీ భవన్ రాజకీయాలు.. పార్టీ వ్యవహారాలపై తాను మాట్లాడను అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పని చేసే వాడే.. నల్గొండ జిల్లా విషయంలో రాయబారిగా నేను ఫెయిల్ అయ్యానని.. నేను చేయాల్సిన రాయభారం చేశా.. కానీ, నిర్ణయం చేసేది వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు.. నిర్ణయాలు పీసీసీ చీఫ్‌ తీసుకుంటారన్నారు.. ఎవిరిని అభ్యర్థిగా పెట్టానా అమ్ముడు పోతున్నారు.. అందుకు నా భార్యను పోటీలో పెట్టానని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.