NTV Telugu Site icon

గాంధీ కుటుంబంపై కక్షతోనే రాజీవ్‌ పేరు తొలగింపు..!

VH

VH

క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారమైన రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారంగా మార్చినట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నేతలు తప్పుబడుతున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు… రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడం దుర్మార్గం అన్నారు.. గాంధీ కుటుంబంపై ఉన్న కక్షతోనే పేరు మార్చారని ఆరోపించిన ఆయన.. ఇది ఎక్కడి న్యాయం మోడీ..? గతంలో ఉన్న పేర్లను మార్చడం మంచిది కాదు అని హితవుపలికారు.. మాజీ ప్రధానమంత్రి పేరును మార్చడం న్యాయం కాదు.. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.. ఇది కక్ష్య సాధింపు చర్య.. ఇలాంటి పనులు ప్రధాని మోడీ మానుకోవాలి సూచించారు. ఇక, మేజర్ ధ్యాన్ చంద్ కి భారతరత్న ఇవ్వండి.. కానీ, ఖేల్‌రత్న అవార్డుకు రాజీవ్‌ పేరు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు వీహెచ్‌.