NTV Telugu Site icon

Congress: టీఆర్ఎస్‌కు షాక్… కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

Priyanka Nallala Odelu

Priyanka Nallala Odelu

టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న భాగ్యలక్ష్మీ కూడా టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రియాంక గాంధీ సమక్షంలో వీరిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లాల ఓదెలును కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్ రావు ఢిల్లీకి తీసుకెళ్లారు.

2009లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి 13వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా గెలుపొందాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం జరిగిన ఉద్యమంలో భాగంగా 2010 ఫిబ్రవరి 14న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఓదేలు 2010, జూలై 30న జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యాడు. 2014లలో జరిగిన తెలంగాణ తొలి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్ పై గెలుపొందాడు. తెలంగాణ చీఫ్‌ విప్‌ గా నియమితులయ్యాడు.

అయితే 2018 ఎన్నికల్లో  టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చలేదు.. కానీ రెండు మూడు చోట్ల ఎమ్మెల్యేలను మార్చారు. ఇందులో ఒకటి ఆందోల్ నియోజకవర్గం నుంచి బాబూ మోహన్ ను తప్పించగా.. చెన్నూర్ నుంచి నల్లాల ఓదెలుకు టికెట్ నిరాకరించారు. చెన్నూర్ స్థానాన్ని బాల్క సుమన్ కు కేటాయించారు. అయితే ఆయనకు సీటు కేటాయించకపోవడం ఆ సమయంలో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. బాల్క సుమన్ పై పెట్రోల్ దాడి కూడా జరిగింది. ఈ దాడిలో గట్టయ్య అనే ఓదెలు అనుచరుడు మరణించారు. తరువాత జరిగిన జెడ్పీ ఎన్నికల్లో నల్లాల ఓదెలు భార్య భాగ్యలక్ష్మీకి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పదవిని ఇచ్చారు.

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా నల్లాల ఓదెలను టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవడం లేదు. దీంతో పాటు పార్టీలో గ్రూపు తగదాలు… బాల్క సుమన్ వ్యవహార శైలి నచ్చకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి, కోటపల్లి, చెన్నూర్, జైపూర్ మండలాల్లో నల్లాల ఓదెలుకు అనుచరులు ఉన్నారు. మరోవైపు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున ముఖ్య నాయకులు ఎవరూ లేకపోవడం కూడా ఓదెలుకు కలిసి వచ్చే అంశాలు.