తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో.. జూబ్లీహిల్స్ నియోజవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. అయితే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ బాధ్యతలను ఇంచార్జి మంత్రులకు అప్పగించారు. అంతర్గత సర్వేల ఆధారంగా ముగ్గురు అభ్యర్థుల జాబితాను రూపొందించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులను రెడ్డి ఆదేశించారు. షార్ట్‌లిస్ట్ చేసిన పేర్లను తుది ఆమోదం కోసం ఏఐసీసీకి పంపించనున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ టికెట్ కోసం పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
Read Also:Hyderabad: దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి.. పల్టీ కొట్టిన క్రేన్…
అయితే, జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్ నుంచి పోటీలో టీమిండియా మాజీ క్రికెట్ మహమ్మద్ అజారుద్దీన్ ఉన్నారు. తాను జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. పార్టీ హైకమాండ్ మద్దతు కూడా తనకు ఉందన్నాడు. ఇక, 2014లో ఎంఐఎం పార్టీ తరపున జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ పోటీ చేశారు.. ఇప్పుడు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్నారు. అలాగే, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం పోటీలో ఉన్నట్లు సమాచారం. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సి. రోహిన్ రెడ్డి కూడా పోటీలో ఉన్నట్లు టాక్. వీరితో పాటు మైనంపల్లి హనుమంతరావు కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా, బీఆర్ఎస్ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్యను పోటీలో నిలబెడుతుంది. పార్టీ సానుభూతి ఓట్లను కూడగట్టాలని తన పార్టీనీ భవిష్యత్ ను పదిలం చేసుకోవాలని చూస్తుంది.
