Site icon NTV Telugu

Hyderabad : కమాండ్‌ కంట్రోల్‌ తెలంగాణ రాష్ట్రానికే ఐకానిక్‌

Mahmood Ali

Mahmood Ali

దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవన నిర్మాణ పనులు 95 శాతం పూర్తయ్యాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 580 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లో చేపట్టిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, అదనపు డీజీపీ జితేందర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, పలువురు అధికారులతో కలిసి సందర్శించారు. భవనంలో జరుగుతున్న పనుల పురోగతిపై ఆర్‌ అండ్‌ బీ సీఈ గణపతిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను బలోపేతం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు మంచి పనితీరును కనబరుస్తున్నారని ప్రశంసించారు. పోలీసు పనితీరుతో దేశవిదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ పనులు 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మరో మూడునెలల్లో కమాండ్‌ కంట్రోల్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. మొత్తం రూ.580 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.450కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. దేశంలో ఏ నగరంలో ఇలాంటి కమాండ్‌ కంట్రోల్‌ భవనం లేదని, యూరోపియన్‌ దేశాల్లో మాత్రమే ఇలాంటి సెంటర్లు ఉన్నాయన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ కమాండ్‌ కంట్రోల్‌ తెలంగాణ రాష్ర్టానికే ఐకానిక్‌గా మారుతుందన్నారు.

Exit mobile version