CM Revanth Reddy: తెలంగాణలో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల నియామక ప్రక్రియకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అందజేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేస్తారని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌ఆర్‌పీబీ) అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌లో తుది ఎంపిక జాబితాను ప్రకటించారు. పోలీస్, జైళ్లు, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగాలకు సంబంధించిన 16,604 పోస్టులకు 12,866 మంది పురుషులు, 2884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. అర్హత లేకపోవడంతో మిగిలిన 854 పోస్టులను బ్యాక్‌లాగ్‌గా పరిగణిస్తారు. పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో 100 డ్రైవర్ పోస్టులు, అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి తుది ఎంపిక ఫలితాలు కోర్టు కేసుల కారణంగా వెల్లడి కాలేదు.
అయితే కోర్టుల్లో వ్యాజ్యాల కారణంగా జాప్యం జరుగుతోంది. తాజాగా అడ్డంకులు తొలగిపోవడంతో ఎంపిక పత్రాలను అందజేయాలని హోంశాఖ నిర్ణయించింది. కానిస్టేబుల్ (తెలంగాణ కానిస్టేబుల్) 4965 పోస్టులకు గాను 3298 మంది పురుషులు, 1622 మంది మహిళలు ఎంపికయ్యారు, ఏఆర్‌లో 4423 పోస్టులకు 2982 మంది పురుషులు, 948 మంది మహిళలు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ మేరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలోని తొమ్మిది విభాగాల్లో ఎంపికైన 6,956 మంది స్టాఫ్ నర్సులకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని వివిధ ఆసుపత్రులు, గురుకులాల్లో స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం మొత్తం 40,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఆగస్టు 2న రాత పరీక్ష నిర్వహించారు.
Rohit Sharma: ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే కెప్టెన్సీలో మార్పు!