Site icon NTV Telugu

CM Revanth Reddy : రాష్ట్రంలో వీధిదీపాల నిర్వహణకు కొత్త దిశ.. సీఎం రేవంత్ కీలక సూచనలు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : రాష్ట్రంలో వీధిదీపాల ఏర్పాటు, నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఐసీసీసీ (ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌)లో మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేమ నరేందర్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్‌ రాజ్‌, పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌. శ్రీధర్‌, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్రీదేవి, కోర్‌ అర్బన్‌ ఏరియా మున్సిపల్‌ సెక్రటరీ ఇలంబర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌తో పాటు అనేక ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వీధిదీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుండి టెండర్లను పిలవాలని సూచించారు. దీనివల్ల పారదర్శకత పెరిగి, సేవల నాణ్యత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, వీధిదీపాల కోసం సౌరశక్తి (Solar Power) వినియోగం సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

వీధిదీపాల పనితీరును నిర్ధారించడానికి ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో థర్డ్‌ పార్టీ ఆడిట్‌ చేయించాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వీధిదీపాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేసి, కేంద్రంగా పర్యవేక్షించే విధానాన్ని రూపొందించాలని సూచించారు. దీని ద్వారా ప్రతి దీపం స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

CM Chandrababu: జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

వీధిదీపాల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా ఎప్పటికప్పుడు విశ్లేషణ జరిపి, సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కారాలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్‌ ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో వీధిదీపాల నిర్వహణను పూర్తిగా గ్రామపంచాయతీలకే అప్పగించాలని నిర్ణయించారు. సర్పంచ్‌లకు దీపాల ఏర్పాటు, నిర్వహణపై పూర్తి అధికారం ఇవ్వబడుతుంది. అయితే, ఈ పనులపై ఎంపీడీవో స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉన్న ప్రతి వీధిదీపం, ప్రతి పోల్‌పై సర్వే చేయాలని సీఎం ఆదేశించారు. దీని ద్వారా సమస్యలు, లోపాలు, అదనపు అవసరాలను గుర్తించి త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. వీధిదీపాల వ్యవస్థను ఆధునీకరించడానికి తీసుకుంటున్న ఈ చర్యలు రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఒక మోడల్‌గా నిలుస్తాయని సీఎం రేవంత్‌ అభిప్రాయపడ్డారు. పారదర్శక విధానాలు, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ, గ్రామీణ స్థాయి అధికారానికి బాధ్యత కల్పించడం ద్వారా వీధిదీపాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Pakistan: పాక్ ఆర్మీ టార్గెట్‌గా ఐఈడీ పేలుడు.. స్పాట్‌లో ఎంత మంది చనిపోయారంటే..

Exit mobile version