CM Revanth Reddy : మిడ్జిల్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం.. నాడు మీరు నాటిన మొక్కే.. నేడు సీఎంగా..

  • 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సీఎం
  • మిడ్జిల్‌ను దత్తత తీసుకోవాలని ప్రతిపాదన
  • కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు
  • 2034 వరకు కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుందన్న ధీమా
Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలానికి చేరుకున్న సీఎం ఏ. రేవంత్ రెడ్డి, అక్కడ ఏర్పాటు చేసిన “కృతజ్ఞత సభ”లో అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం, జూలై 2006లో మిడ్జిల్ మండల ప్రజలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆశీర్వదించి గెలిపించి సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించారని గుర్తుచేసుకున్నారు. ఆనాడు ఈ ప్రాంత ప్రజలు నాటిన మొక్కే, ఈనాడు మహా వృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు తనది కాదని, తనను ఆదరించిన మిడ్జిల్ ప్రజలదని, ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి తన ప్రాణమిచ్చినా తక్కువేనని సీఎం వ్యాఖ్యానించారు.

మిడ్జిల్ దత్తత.. పెద్ద మనసు చాటుకున్న సీఎం

ఒకప్పుడు డార్క్ మండలాలుగా (చీకటి ప్రాంతాలుగా) ఉన్న మిడ్జిల్, గట్టు ప్రాంతాల ప్రజలు 2006 లో మార్పు కోసం తీసుకున్న నిర్ణయమే తనను ఈ స్థాయికి చేర్చిందన్నారు. ఈ మండలాన్ని జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు గాను, దీనిని దత్తత తీసుకోవాలని సభలోనే ఉన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇదే సభలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఎదుగుదలకు తోడ్పడిన మిడ్జిల్ బిడ్డ ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. అలాగే, ఆనాడు జడ్పీటీసీ ఎన్నికల్లో తనపై ఓడిపోయిన రబ్బానీకి ఒక మంచి పదవి ఇచ్చి గౌరవించాలని డిప్యూటీ సీఎంకు సూచించి రేవంత్ రెడ్డి తన రాజకీయ సంస్కారాన్ని చాటుకున్నారు.

పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా?

నల్లమల అడవుల నుంచి వచ్చిన తనకు పరిపాలన గురించి ఏమీ తెలియదని కొందరు అహంకారంతో అవహేళన చేశారని సీఎం మండిపడ్డారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కారమైతే రాష్ట్రంలో సమస్యలు ముగిసినట్లేనని, క్షేత్రస్థాయి ఇబ్బందులు తెలిసిన గ్రామీణ ప్రాంత వ్యక్తిగా తనకు పాలనపై పూర్తి అవగాహన ఉందన్నారు. “పరిపాలన చేయడానికి పాలమూరు బిడ్డ పనికిరాడా?” అని ప్రశ్నించిన ఆయన.. పేదల గళం గద్దర్ అన్నను గడీల ముందు నిలబెట్టిన వారికి ప్రజలు బుద్ధి చెప్పినా అహంకారం తగ్గలేదని విమర్శించారు. కులగణన ద్వారా వందేళ్ల సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని, పేదల పక్షాన నిలబడి సన్నబియ్యం, రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, సన్న వడ్లకు బోనస్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

కేసీఆర్ పాలనపై నిప్పులు.. 2034 వరకు కాంగ్రెస్ దే అధికారం

పదేళ్ల పాలనలో 8 లక్షల 21 వేల కోట్ల అప్పులు మిగిల్చిన కేసీఆర్, ప్రజలకు చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. “ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? దళితులకు మూడెకరాలు ఇచ్చారా? డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించారా?” అని ప్రశ్నించారు. కేవలం తమ దోపిడీ, దొంగతనాలు ఆగిపోయాయనే బాధతోనే కేసీఆర్ కొడుకు, అల్లుడు మళ్లీ అధికారంలోకి రావాలని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దండుకున్న చరిత్ర వారిదని, అధికారంలో ఉన్నప్పుడు ఆడబిడ్డల ఫోన్ మాటలను దొంగతనంగా విన్న వాడు అసలు మనిషేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ ఇక అధికారాన్ని మర్చిపోవాల్సిందేనని, తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా, దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు తెలంగాణ ప్రజలంతా అండగా నిలవాలని, ఆ చారిత్రక అడుగు మిడ్జిల్ నుంచే పడాలని పిలుపునిచ్చారు.