Site icon NTV Telugu

CM Revanth Reddy : జూబ్లీహిల్స్ గడ్డపై మూడు రంగుల జెండా ఎగరేస్తాం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. “జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరేస్తుంది అనే నమ్మకం నాకు వచ్చింది. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం. ప్రతి సారి అవకాశం రావడం జరగకపోవచ్చు కానీ, అవకాశం వచ్చినప్పుడు మనతో నిలబడిన వారిని గెలిపించుకోవడం అవసరం,” అని సీఎం రేవంత్ అన్నారు.

పీవీ నరసింహారావు, పీజేఆర్ కుటుంబాలపై గతంలో జరిగిన రాజకీయాలను గుర్తుచేసుకుంటూ ఆయన బీఆర్‌ఎస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “పీజేఆర్ మరణించినప్పుడు ఆయన కుటుంబానికి మద్దతుగా నిలవాల్సింది చంద్రబాబు, కానీ కెసిఆర్ దుష్ట సంప్రదాయానికి నాంది పలికాడు. నేడు అదే పార్టీ సానుభూతి ఓట్లు అడుగుతోంది. మీకు ఆ హక్కు ఎక్కడుంది?” అని ప్రశ్నించారు.

కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ విజయాన్ని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి… “అక్కడ ప్రజలు అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించారు. కంటోన్మెంట్‌లో 4 వేల కోట్ల అభివృద్ధి జరుగుతోంది. కానీ కేసీఆర్ పదేళ్లు సీఎం గా ఉన్నా, జూబ్లీహిల్స్‌కు ఒక్కసారి కూడా రాలేదు. సినిమా కార్మికుల సమస్యల వైపు చూడలేదు,” అని విమర్శించారు. అంతేకాకుండా.. “కేంద్ర మంత్రి బండి కిషన్ రెడ్డి, సంజయ్ ఒక్క చిల్లిగవ్వ కూడా తెచ్చారా? పాకిస్తాన్ ముద్దిమీద తన్నినప్పుడు సప్పుడు చేయలేదు కానీ ఇక్కడ కార్పెట్ బాంబింగ్ చేస్తామంటారు. ఇది ప్రజలను మభ్యపెట్టే రాజకీయమే,” అని రేవంత్ రెడ్డి అన్నారు.

రేషన్ కార్డులు, సబ్సిడీలు, సన్న బియ్యం పథకం వంటి పేదల సంక్షేమ పథకాలను గుర్తుచేసిన ఆయన, “బీఆర్‌ఎస్‌ అధికారంలో వస్తే రేషన్ కార్డులు రద్దవుతాయి. సన్న బియ్యం రద్దవుతుంది. మన ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. జూబ్లీహిల్స్‌కి యువకుడు నవీన్ యాదవ్ అవసరం. సెంటిమెంట్ కాదు, అభివృద్ధి కావాలి,” అని ప్రజలను కోరారు. “నేను అజారుద్దీన్‌ను మంత్రిగా చేస్తానని మాట ఇచ్చాను, దాన్ని నిలబెట్టుకున్నాను. ఆయన ఎప్పుడూ ప్రజల సమస్యల పట్ల స్పందిస్తారు,” అన్నారు. జూబ్లీహిల్స్‌లో మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించారు. “ఎన్టీఆర్ మనందరికీ ఆదర్శనీయుడు. రాజకీయాలకు అతీతంగా ఆయనను గౌరవించాలి,” అని సీఎం పిలుపునిచ్చారు.

Allu Sirish Engagement: ఆమెతో అల్లు శిరీష్ నిశ్చితార్థం..

Exit mobile version