Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రతి డివిజన్ వారీగా మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికలో ప్రతి ఓటు కీలకమని భావించిన సీఎం, బలమైన మంత్రులను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో రహమత్‌నగర్ డివిజన్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను నియమించారు. బోరబండ డివిజన్ బాధ్యతలు సీతక్క, మల్లు రవికి అప్పగించారు. వెంగళ్ రావునగర్ డివిజన్‌లో తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సమన్వయం చేస్తారు.
సోమాజిగూడ డివిజన్ పర్యవేక్షణ బాధ్యతలు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ వహించనున్నారు. షేక్‌పేట డివిజన్ బాధ్యతలు కొండా సురేఖ, వివేక్ తీసుకుంటారు. ఎర్రగడ్డ డివిజన్‌ను దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు చూసుకుంటారు. అలాగే యూసుఫ్‌గూడ డివిజన్ పర్యవేక్షణ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నంలకు అప్పగించారు. ఉప ఎన్నికలో సమన్వయం, ప్రచార వ్యూహం, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రతి మంత్రి స్థాయిలో పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
