Site icon NTV Telugu

ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ క్యాడర్‌ రూల్స్‌పై ప్రధాని మోడీకి కేసీఆర్‌ లేఖ

ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ (1954) సవరణ పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు.కేంద్రం చేపట్టిన ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ 1954 ప్రతిపాదిత సవరణలు ఏ రకంగా చూసినా రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమని లేఖలో కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ సవరణలు ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ ల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరణలను పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఏఐఎస్ అధికారులు నిర్వర్తించే క్లిష్టమైన ప్రత్యేక బాధ్యతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేనిదే బదిలీపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్రాల పరిపాలనలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది రాజ్యాంగ స్వరూపానికి, సహకార సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టులాంటిదన్నారు.

ఈ సవరణల ద్వారా రాష్ట్రాలు గుర్తింపు లేకుండాపోయి నామమాత్రపు వ్యవస్థలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నది. ఈ ప్రతిపాదిత సవరణలు రాష్ట్రాల్లో పనిచేసే అధికారులపై పరోక్ష నియంత్రణను అమలుచేసే ఎత్తుగడ అని లేఖలో కేసీఆర్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే ఈ సవరణకు కేంద్రం తెరతీసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఏఐఎస్ అధికారులను బాధ్యులుగా, జవాబుదారులుగా చేయాల్సిందిపోయి..వారిని మరింత నిరుత్సాహానికి గురిచేయడం, కేంద్రం చేత వేధింపుల దిశగా ఈ సవరణ ఉసిగొల్పుతుందన్నారు.

https://ntvtelugu.com/minister-errabelli-dayakar-rao-warangal-conducted-a-review-with-market-officials/

ఈ విధానం ఏఐఎస్ అధికారుల ముందు రాష్ట్రాలను నిస్సహాయులుగా నిలబెడుతుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 లోని నిబంధనల ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ 1951 చట్టాన్ని పార్లమెంటు చేసిందని, దాని ప్రకారం భారత ప్రభుత్వం పలు నిబంధనలను రూపొందించిం దన్నారు. కాని, రాష్ట్రాల ఆకాంక్షలను కాలరాసే విధంగా దేశ సమాఖ్య రాజనీతిని పలుచన చేసే దిశగా ఏఐఎస్ క్యాడర్ రూల్స్ (1954)కు రంగులద్దుతూ ఉద్దేశపూర్వకంగా చేసిన సవరణను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇది ఏఐఎస్ క్యాడర్ రూల్స్ 1954 సవరణ ఎంత మాత్రం కాదు. ఈ సవరణ కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించి భారత రాజ్యాంగాన్ని సవరించడమే తప్ప మరోటి కాదు.

Read Also: బీజేపీ ప్రభుత్వ అకృత్యాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది: కొప్పుల ఈశ్వర్‌

ఏఐఎస్ సవరణను ఇట్లా దొడ్డిదారిన గాకుండా కేంద్ర ప్రభుత్వానికి ధైర్యముంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా సవరించాలి. రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలుగకుండా ఉండాలంటే, రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొన్న తర్వాతే రాజ్యాంగ సవరణలు చేపట్టాలనే నిబంధనను ఆర్టికల్ 368 (2) లో రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారు.ఈ సవరణ ప్రతిపాదనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలకు మరింత విఘాతం కలిగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనా పరమైన పారదర్శకతను, రాజ్యాంగ సమాఖ్య రాజనీతిని కొనసాగేంచాలని, అందుకు ప్రస్తుతం కేంద్రం చేపట్టిన ప్రతిపాదిత సవరణలను నిలిపివేయాలని నేను కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

Exit mobile version