Site icon NTV Telugu

Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ

Ryutubandhu

Ryutubandhu

నేడు రైతులకు పెట్టుబడి పైసలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సాయం డ‌బ్బులు ఖాతాల్లో జ‌మ కానున్నాయి. తొలిరోజు ఎక‌రం భూమి ఉన్న రైతుల‌కు ఎప్ప‌టిలాగే పైస‌లు ప‌డ‌నున్నాయి. క్ర‌మ‌ప‌ద్ద‌తిలో రైతులంద‌రికీ జ‌మ చేయ‌నున్నారు. అయితే.. ఈ ఏడాది కొత్త‌గా 3064లక్ష‌ల మంది రైతుల‌కు రైతుబంధు సాయం అంద‌నుంది. అయితే గ‌త సీజ‌న్ తో పోల్చితే ల‌బ్దిదారులైన రైతుల సంఖ్య భారీగా పెర‌గ‌డంతో పాటు నిధుల మొత్తం కూడా పెరిగింది. ఇప్పుడు ఈ వానకాలం సీజన్‌కు రైతుబంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.94 లక్షలుగా లెక్కతేల్చింది ప్రభుత్వం. అయితే రైతుబంధు పంపిణీ కోసం రూ.7,654.43 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ తెల‌ప‌డంతో.. 1.53 కోట్ల ఎకరాలకు ప్రభుత్వం రైతుబంధు జమ చేయనుంది. ఇవాళ తొలిరోజైన మంగళవారం ఎకరం భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు రూ.586.65 కోట్లు ఖాతాల్లో జమ‌చేసేందుకు స‌ర్వం సిద్దం చేసింది.

అయితే వానాకాలం ప్రారంభం కాగానే రైతుబంధు సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు రైతన్న‌లు. కాగా రైతుల‌ను ఆశను వమ్ము చేయకుండా ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట ప్రకారం సీజన్‌ ప్రారంభ సమయంలోనే రైతుబంధు నిధులను అందించేందుకు ప‌కడ్బందీ ఏర్పాట్లు చేసింది. నేడు (మంగళవారం) నుంచి రైతుబంధు పైసలు జమవుతుండడంతో రైతుల్లో సంతోషం, క‌ళ్ల‌ల్లో ఆనందం కనిపించ‌నుంది. పెట్టుబడి భారం తీరిందనే భరోసా వారిలో కనిపించ‌నుంది. అయితే గ‌త ఏడాది సీజన్‌ వరకు రికార్డు స్థాయిలో రైతుబంధు కింద రూ. 50,448 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. కాగా.. ఈ సీజన్‌లో పంపిణీ చేయబోయే రూ. 7,654.43 కోట్లతో కలిపితే ఇప్పటివరకు రూ. 58,102 కోట్లకు అందించిన సాయం చేరనుంది.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీకి వ్యవసాయశాఖ తరుపున ఏర్పాట్లు పూర్తిచేశామని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు. ఉదయం పూటే రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు జమయ్యేలా చర్యలు తీసుకొన్నాం. రైతులకు ఏమైనా సమస్యలుంటే స్థానిక ఏఈవోను కలిసి ఫిర్యాదు చేస్తే సమస్యలను పరిష్కరిస్తామని రఘునందన్‌రావు ప్రకటించారు.

Exit mobile version