NTV Telugu Site icon

CM KCR Medchal Meeting: తెలంగాణలో 24 గంటలు కరెంట్ పోదు.. ఢిల్లీలో 24 గంటలు కరెంట్ రాదు

Kcr Speech Medchal Meeting

Kcr Speech Medchal Meeting

CM KCR Speech At Medchal Malkajgiri Event: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 24 గంటలు కరెంట్ పోదు.. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 గంటలు కరెంట్ రాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. గతంలో తెలంగాణలో ఎక్కడా కరెంట్ ఉండేది కానీ, ఇప్పుడు మాత్రం 24 గంటల కరెంట్ వస్తోందని తెలిపారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తోన్న రాష్ట్రం కేవలం ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు. 75 ఏళ్ల నుండి అసమర్థ పాలన వల్ల దేశంలో కరెంట్ సమస్య ఏర్పడిందని.. ఢిల్లీలో 24 గంటల కరెంట్ రాదని పేర్కొన్నారు. దేశంలో జరిగే రాజకీయాల గురించి కేవలం టీవీల్లో చూడటం, పేపర్లలో చదవడం కాదు.. గ్రామాల్లో, పట్టణాల్లో చర్చించుకోవాలని అన్నారు.

కులం, మతం పేరుతో దేశాన్ని చీల్చే కుట్ర జరుగుతోందని.. అందుకు భిన్నంగా మనం ఐక్యతగా మెలగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. చైనా, సింగపూర్, కొరియా లాంటి దేశాల్లాగే.. మన భారతదేశం కూడా ఎదగాలన్నారు. దేశంలో అభివృద్ధి జరగాలంటే, దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నారు. ఢిల్లీలో మంచి నీళ్ళు కొనేంత దుర్భర పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణలో మంచి నీళ్లు లభ్యమవుతున్నప్పుడు, దేశ రాజధాని అయిన ఢిల్లీలో మంచి నీళ్లు లేకపోవడమేంటని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు, దుర్మార్గులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని.. దీనిపై మీరంతా (ప్రజల్ని ఉద్దేశిస్తూ) చర్చించుకోవాలని, వాళ్లని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎవడో వచ్చి ఏదో చెప్తాడని, అది మనకు మంచి కాదని, ఏమరుపాటుగా ఉంటే అభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించారు.

మేడ్చల్ జిల్లా ఏర్పాటు, పరిపాలన భవనం ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ అన్నారు. అసలు మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవ్వరూ ఊహించలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత మనం మేడ్చల్ జిల్లా సాకారం చేసుకున్నామన్నారు. రైతు వేదికలు, ఏఈఓలను నియమించామని.. పరిపాలన వికేంద్రీకరణ జరగడం వల్లే ఇన్ని భవనాల్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మనం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు లబాసాటిగా మారాయన్నారు. 57 ఏళ్ల వారికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులను పెంచి, మేడ్చల్ జిల్లా పరిధిలో కేటాయిస్తామన్నారు. ఇప్పుడున్న 5కోట్లకు అదనంగా మరో 10 కోట్లు ఎమ్మెల్యే ఫండ్ కింద ఇచ్చి, రేపే జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగిందన్నారు.

కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద 11 లక్షల మంది లబ్ది పొందారని కేసీఆర్ వెల్లడించారు. ఆసరా పెన్షన్ నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇస్తున్నాడని తెలంగాణలో ప్రతిఒక్కరూ గర్వంగా చెప్తున్నారన్నారు. ఒకవేళ కరోనా రాకపోయి ఉంటే.. ఈపాటికి రాష్ట్రంలో 500 రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రారంభించేవాళ్లమన్నారు. ఒకప్పుడు మన రాష్ట్రం నుంచి కూలీల కోసం పోయేవారని, ఇప్పుడు 12 రాష్ట్రాల నుండి కార్మికులు తెలంగాణకు వచ్చి పని చేసుకుంటున్నారన్నారు. 60 ఏళ్ల కింద నిద్రపోయి ఉండే తెలంగాణ రాష్ట్రానికి పోరాడి తెచ్చుకున్నామన్నారు. ఉద్యమకాలంలో ఏది కావాలని కోరుకున్నామో.. అది సాధించుకున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.