NTV Telugu Site icon

కేసీఆర్ వ్యూహం మారింది.. ఆ వర్గం ఎమ్మెల్యేల్లో కొత్త ఆశ‌లు..!

kcr

తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త శ‌కం ప్రారంభ‌మైంది.. ఇప్పుడు అంద‌రి నోట ద‌ళితుల మాటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ద‌ళిత కోసం ఓ ఉద్య‌మాన్నే బుజాల‌కు ఎత్తుకున్నారు.. దళితబంధు పథకాన్ని ప్ర‌వేశ‌పెట్టారు.. దీనిని కేవ‌లం ఒక ప్రాంతానికి ఏ ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం చేయ‌కుండా.. క్ర‌మంగా రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.. దళితులకు మరింత ప్రాధాన్యత ఇస్తామని. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ దళితులకు రిజర్వేషన్ కల్పిస్తామని.. అన్ని అంశాల్లోనూ వారికి లబ్ది కలిగేలా చర్యలు తీసుకుంటామంటూ.. హుజూరాబాద్ వేదిక‌గా జ‌రిగిన స‌భ‌లో ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్.. సీఎంవోలో ద‌ళిత అధికారులు లేర‌న్న విమ‌ర్శ‌ల‌కు కూడా అక్క‌డి నుంచే చెక్ పెట్టేశారు.. ఏదేమైనా.. ద‌ళితుల ఓట్ల‌ను గంప‌గుత్త‌గా గులాబీ పార్టీకి ప‌డేలా.. గులాబీ బాస్ వ్యూహంగా క‌నిపిస్తోంది.. ఇక‌, రాజకీయంగా ఆ వర్గానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నార‌ని తెలుస్తోంది.. త్వరలోనే మంత్రివర్గంలోకి ద‌ళితుల‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.. దీంతో.. ఆ వ‌ర్గం ఎమ్మెల్యేల్లో కొత్త ఆశ‌లు మొద‌ల‌య్యాయి.

మ‌రోవైపు.. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. వారికి మరో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక ఖాళీ ఏర్పడింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో కొందరిని త‌ప్పించి.. మ‌రికొంద‌రు కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పించే అవ‌కాశం ఉందంటున్నారు. అలా కొందరిని తప్పించి వారి స్థానంలో దళిత వర్గానికి చెందిన నేతలకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ప్లాన్‌గా ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది.. ప్ర‌స్తుతం కేబినెట్‌లో మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతలెవరూ లేరు. మంత్రివర్గ విస్తరణ చేపట్టి ఈ వర్గానికి చెందిన ఇద్దరికి అవకాశం ఇవ్వాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేశారని… ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓ యువ ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని తెలుస్తోంది. కేబినెట్‌తో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ దళిత సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా మారిన రాజ‌కీయ ప‌రిస్థితులు.. ద‌ళితుల పెరిగిన ప్రాధాన్య‌త‌త‌.. కేబినెట్‌లోనూ ద‌ళిత ప్ర‌జాతినిధుల‌కు ఛాన్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారంతో.. ఆ వ‌ర్గం ఎమ్మెల్యేల్లో కొత్త ఆశ‌లు చిగురిస్తున్నాయి.