NTV Telugu Site icon

మంత్రి ఈట‌ల భూక‌బ్జా… విచార‌ణ‌కు సీఎం కేసీఆర్ ఆదేశం

KCR Etala Rajender

తెలంగాణ‌లో ఎన్టీవీ క‌థ‌నం సంచ‌లం సృష్టించింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా బాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. జమున హ్యాచరీస్ కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి వందల కోట్ల విలువైన భూముల‌ను ఆక్రమించినట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.. ఈట‌ల అనుచ‌రులు త‌మ‌ను బెద‌రించి భూములు లాక్కొన్నార‌ని బాధితులు ఆరోపిస్తున్నారు.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట్ లో ఇది వెలుగు చూడ‌గా.. 130/5, 130/10, 64/6 సర్వే నెంబర్లలో గల భూమిని మంత్రి కబ్జాకు పాల్ప‌డిన‌ట్టు ఎన్టీవీ ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నం బ‌య‌ట‌ప‌డింది.. అయితే, ఈ ఘ‌ట‌న‌పై సీరియ‌స్‌గా స్పందించారు సీఎం కేసీఆర్.

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్ సోమేష్ కుమార్‌ను ఆదేశించారు. ఇక‌, ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావుని అదేశించారు సీఎం… సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాథ‌మిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు.