Telangana Chief Minister K.Chandra Shekar Rao Are Going to National Politcis.
జాతీయ రాజకీయాల పట్ల తన తాజా ఆలోచనలను టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ ప్లీనరీ సందర్భంగా శ్రేణులతో పంచుకున్నారు. ఢిల్లీ పాలిటిక్స్‌పై ఆయన మాటలు గతంలో కంటే ఇప్పుడు కాస్త భిన్నంగా ఉన్నాయి. సందర్భం వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్, బీజేపీ యేతర ఫ్రంట్ గురించి మాట్లాడే ఆయన ఈసారి దాని గురించి ప్రస్తావించలేదు. పైగా ఫ్రంట్ లేదు ఏమీ లేదని తనదైశైలితో తేల్చిపడేశారు. కూటములతో, ప్రధానులను గద్దె దించటంతో దేశానికి ప్రయోజనం లేదని…ఇన్నేళ్లుగా జరుగుతున్నది ఇదే అని కేసీఆర్ చెప్పటం రాజకీయ నాయకులలో ఆసక్తిని రేపుతోంది.
ప్రస్తుతం దేశానికి కావాల్సినది కొత్త ఫ్రంట్ కాదని..కొత్త ఎజెండా కావాలని నొక్కి చెప్పారు. ఐతే, ఎజెండాను సిద్ధం చేసి ప్రజల ముందుకు ప్రభావవంతంగా తీసుకువెళ్లే ప్రక్రియ గురించి కేసీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రక్రియలో తనతో కలిసి నడిచే పార్టీలతో ప్రజల ముందుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ప్రక్రియను ఇప్పుడు ఆయన దేశానికి వర్తింపజేయాలనుకుంటున్నారు. అన్ని వర్గాలు, రంగాలకు చెందిన వారితో చర్చించి తెలంగాణ ఉద్యమ ఎజెండాను రూపొందించటం మనం చూశాం. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఏర్పాటుకు కూడా ఆయన ఆ ఫార్ములానే అనుసరించే అవకాశం ఉంది. ముందుగా బంగారు భారత్ ఎజెండాను రూపొందించాలని కేసీఆర్ భావిస్తున్నారని అర్థం అవుతోంది. ఎజెండాతో ప్రజల ముందుకు వెళితేనే ప్రయోజనమని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు.
ప్లీనరీలో కేసీఆర్ మాటలను బట్టి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను వ్యతిరేకించే పార్టీలతో ఫ్రంట్ కట్టాలన్న ఆలోచనలను ఇప్పటికై విరమించుకున్నట్టే అనిపిస్తోంది. రాజకీయాలలో భవిష్యత్ గురించి ముందే చెప్పటం కష్టం. కనుక కేసీఆర్ రేపు ఏమి చెపుతారో..ఏమి చేస్తారో ఎవరూ ఊహించలేరు. కానీ, ప్రస్తుతం దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు కోసం ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాను సిద్ధం చేయడంపై ఆయన దృష్టి సారించారనేది మాత్రం వాస్తవం. దాని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లే వేదికగా జాతీయ పార్టీని ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఆయనకు ఉందని తెలుస్తోంది.
గతంలో మాదిరిగా కేసీఆర్ తాను వివిధ రాజకీయ పార్టీల నేతలు, సీఎంలతో జరిపిన భేటీల గురించి ప్లీనరీలో ప్రస్తావించ లేదు. జాతీయ పార్టీని ఏర్పాటు యోచనలో ఆయన ఉన్నారనే వాదనకు ఇది కొంత బలం చేకూరుస్తోంది. టీఆర్‌ఎస్‌ని బీఆర్‌ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి)గా మార్చాలని కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు సూచించిన విషయాన్ని ప్రస్తావించటాన్ని బట్టా ఆయన మనసులో ఏముందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే కిశోర్ రాసిన వ్యాసాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించటం గమనార్హం. దేశానికి కేసీఆర్ వంటి దార్శనిక నాయకుడు కావాలని, జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ప్లీనరీ ప్రవేశపెట్టిన 13 తీర్మానాలలోనూ ప్రస్తావించారు.
రానున్న రోజులలో జాతీయ రాజకీయాలలో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని ఓ తీర్మానం స్ఫష్టంగా పేర్కొంది. జాతీయ రాజకీయాలలో నెలకొన్న శూన్యతను పూరించేందుకు కేసీఆర్ నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తోంది. విద్య, నీటిపారుదల, ఆరోగ్యం, ఆర్థిక రంగాలలో గొప్ప ఫలితాలు సాధించిన తెలంగాణ తరహాలో దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని పార్టీ తీర్మానించింది. అలాగే ప్రస్తుత పాలకుల “విభజించి పాలించు”విధానాలు, ‘బుల్‌డోజర్ పాలన’ నుంచి దేశానికి విముక్తి కలిగించాలని కూడా ప్లీనరీ తీర్మానించింది.
పార్టీ నేతలు చేసిన సూచనలపై స్పందించిన కేసీఆర్ తన శక్తి మేరకు క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ప్లీనరీలోప్రతినిధులు పదే పదే ‘దేశ్ కా నేత కేసీఆర్’ అంటూ నినాదాలు చేయటం ఇక్కడ గమనార్హం. అధికార పార్టీలకు వ్యతిరేకంగా కూటములు కట్టే రొటీన్ రాజకీయాల నుంచి దేశం బయటపడాలని టీఆర్ఎస్ అధినేత పదే పదే వ్యాఖ్యానించటం ఆయన కొత్త ఆలోచనలను తెలియజేస్తోంది. నాలుగు పార్టీలు, లేదంటే నలుగురు నాయకులు కలిసి ప్రధానిని గద్దె దించి..ఆయన స్థానంలో మరొకరికి పట్టం కట్టటం దేశ సమస్యలకు పరిష్కారం కాదని కేసీఆర్ చెప్పటం విశేషం.
గత ఐదు యాబై ఏళ్లలో చాలా సార్లు ఫ్రంట్ ప్రయోగాలు జరిగాయి. కానీ పెద్దగా ఫలితాలు సాధించని విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. కొందరు కమ్యూనిస్టు నేతలు తనను కలిసి వివిధ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని కోరారని, ఐతే, కేవలం ఒక పార్టీనో వ్యక్తినో అధికారం నుండి తొలగించడమే లక్ష్యంగా పెట్టుకునే కార్యక్రమంలో తాను భాగం కాదలచుకోలేదని కూడా టీఆర్‌ఎస్ అధినేత వెల్లడించారు. కనుక ఇప్పుడు కావాల్సింది రాజకీయ నాయకుల అవసరాల కోసం..పార్టీ సిద్ధాంతాల కోసమో ఏర్పడే ఫ్రంట్ కాదు.. ప్రజల కోసం పనిచేసే ఫ్రంట్ కావాలని కేసీఆర్ గట్టిగా కోరుకుంటున్నారు.
ప్రత్యామ్నాయ ఎజెండా, సమగ్ర నూతన వ్యవసాయ విధానం, కొత్త ఆర్థిక విధానం, కొత్త పారిశ్రామిక విధానం అవసరమని కేసీఆర్ నమ్ముతున్నారు. ఆర్థికనిపుణులు, మేధావులు, ఉద్యోగ విరమణ చేసిన అఖిల భారత సర్వీసుల అధికారులతో సంప్రదింపులు జరిపి ..ప్రత్యామ్నాయ ప్రజా ఎజెండాను రూపొందించే ప్రణాళికల గురించి కేసీఆర్ వివరించారు. జాతీయ రాజకీయాలు, దేశంలో ఉన్న వనరులు, దేశం ఏ దిశలో ముందుకెళ్లాలి అనే అంశాలపై సమగ్ర విశ్లేషణ చేస్తామని కేసీఆర్ చెప్పారు. దేశ, విదేశాల్లోని ఆర్థిక నిపుణులతో 15-20 రోజుల పాటు అన్ని అంశాలను విశ్లేషించి చర్చిస్తారని.. మేధావులను కూడా ఆహ్వానిస్తానని.. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మరికొందరు వస్తున్నారని చెప్పారు. దేశంలో పరిష్కరించాల్సిన కీలక అంశాలను గుర్తించటం కోసం 200 మంది రిటైర్డ్ అఖిల భారత సర్వీసు అధికారులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నారు.
ఏడేళ్ల క్రితం ఏర్పాటైన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించగలిగినపుడు .. దానిని దేశం ఇప్పటి వరకు ఎందుకు సాధించలేకపోయిందనే చర్చకు తెరలేపేందుకు తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను రూపొందించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కలలు కనటమే కాదు ..వాటిని ఎలా సాకారం చేసుకోవాలో తెలంగాణ చేసి చూపించిందని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. అమెరికా కన్నా ఎక్కువగా అభివృద్ధి చెందగలిగిన సత్తా మనకు ఉందంటే గతంలోనే ఆయన ‘బంగారు భారత్’ సాధనకు పిలుపునిచ్చారు.
బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ప్రయత్నాలలో భాగంగాగత ఫిబ్రవరిలో కేసీఆర్ ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్‌లను కలిశారు. తరువాత రాంచీ వెళ్లి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో భేటీ అయ్యారు. మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జనతాదళ్-సెక్యులర్ పార్టీ, సీపీఐ, సీపీఐ-ఎం, రాష్ట్రీయ జనతాదళ్ నేతలతో టీఆర్‌ఎస్ అధినేత గతంలో అనేక మార్లు చర్చలు జరిపారు. ఐతే, ప్లీనరీ ప్రసంగంలో ఆయన వీటి గురించి ప్రస్తావించలేదు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్రంట్ ఆలోచనను విరమించుకుని ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్ రెండింటికి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమి కట్టాలని కేసీఆర్ ఇలాగే ప్రయత్నించారు. ఐతే, ప్రతిపాదిత ఫ్రంట్‌కు కాంగ్రెస్‌ను దూరంగా ఉంచాలనే ఆలోచనను కొన్ని పార్టీలు వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడే ఏ కూటమిలోనైనా కాంగ్రెస్ భాగస్వామ్యం అనివార్యం అనే భావనలో చాలా ప్రాంతీయ పార్టీలు ఇప్పటికీ విశ్వసిస్తున్నాయి. కనుక కేసీఆర్ ఇప్పుడు వేచి చూసే విధానాన్ని అవలంబించవచ్చు.
కేసీఆరు ప్రస్తుతం చెపుతున్నది 2024 సార్వత్రిక ఎన్నికల గురించి. కానీ దానికి ముందు ఆయనకు 2023లో పెద్ద పరీక్ష ఎదురుచూస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ తో పోరాడాల్సి వుంది. ఆ పోరాటంలో గెలిస్తేనే ఈ ప్రణాళికలన్నీ.. ఓడిపోతే కథ అక్కడితో ముగిసినట్టే. కేసీఆర్ తాజా ఆలోచనల వెనక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే మాట కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.
