దేశంలో రాజకీయాలను మార్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అందులో భాగంగా కేసీఆర్ ఆదివారం ముంబై బయలుదేరి వెళ్ళారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌లతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట.. ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు జె.సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బి.బి పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ముంబయి పర్యటన నేపథ్యంలో… అక్కడ భద్రతా చర్యలు పటిష్ఠం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు కలిసి పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. సినీనటుడు ప్రకాష్ రాజ్ హోటల్లో కేసీఆర్ టీంకు స్వాగతం పలికారు. హయత్ గ్రాండ్ నుంచి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్ష కు బయలుదేరి వెళ్ళారు కేసీఆర్.
కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం లో పలు కీలక విషయాలను చర్చించే అవకాశం వుంది. బీజేపీ నిరంకుశ విధానాలు, ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు సీఎంలు చర్చిస్తారు. చర్చల అనంతరం ఇవాళ రాత్రి 7.20 గంటలకు ముంబయి నుంచి సీఎం హైదరాబాద్‌కు బయల్దేరతారు. ఇప్పటికే కేరళ, పశ్చిమబెంగాల్ సీఎంలు కేసీఆర్ తో చర్చించారు. దేశంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీయేతర కూటమి ద్వారా పోరాటం చేయనున్నారు.