Site icon NTV Telugu

CM KCR: కారేప‌ల్లి అగ్నిప్రమాద ఘ‌ట‌న‌.. సీఎం కేసీఆర్‌ ఏమన్నారంటే..

Cm Kcr

Cm Kcr

BRS Athmeeya Sammelanam: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదంపై బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం సమీపంలో సిలిండర్లు పేలడంతో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడడం బాధాకరమన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వర్ రావులకు ఫోన్ చేసి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.

మంత్రి కేటీఆర్

వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన అగ్నిప్రమాదంపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి మాట్లాడారు. అగ్ని ప్రమాదంపై కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు, అధికారులతో కేటీఆర్ మాట్లాడారు. మృతుల కుటుంబాన్ని, క్షతగాత్రులను ఆదుకుంటామని తెలిపారు.

మంత్రి హరీశ్‌రావు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతులు, క్షతగాత్రులను మంత్రి హరీశ్‌రావు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి అత్యున్నత స్థాయిలో వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే క్షతగాత్రులను నిమ్స్ ఆస్పత్రికి తరలించి అత్యున్నత స్థాయిలో వైద్యం అందించాలని ఆదేశించారు.

ఎంపీ నామా నాగేశ్వరరావు

బీఆర్ఎస్ ఆత్మీయ సభలో అగ్నిప్రమాదంపై ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించారు. ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. బాణాసంచా పేలడం వల్ల గుడిసెలో మంటలు చెలరేగలేదని, ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరమని, ప్రమాద స్థలానికి, సమావేశ స్థలానికి మధ్య చాలా దూరం ఉందని అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు.

విషాదం

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే రాములునాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి నేతలంతా తరలివచ్చారు. గ్రామానికి అగ్రనేతలు రాక సందర్భంగా పార్టీ శ్రేణులు పటాకులు కాల్చారు. పటాకులు కాల్చడంతో మంటలు పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. మంటలు చెలరేగి లోపల ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. అదే సమయంలో నివాసంలో ఉన్న సిలిండర్ పేలింది. సిలిండర్‌ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. ఇద్దరు మృతి చెందారు. పోలీసులు, జర్నలిస్టులకు తీవ్ర గాయాలు కాగా.. విధులు నిర్వహిస్తున్న సీఐతో సహా 10 మంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. గాయపడిన వారి పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version