దేశంలో బీజేపీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని.. ఈ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీల నేతలు తనను కలిసి తమతో చేతులు కలపాలని కోరినట్లు ప్లీనరీలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే తాను వాళ్లతో రానని స్పష్టం చేసినట్లు వివరించారు. ఎవరినో గద్దె ఎక్కించేందుకు లేదా గద్దె దించేందుకు తాను పనిచేయనని చెప్పారు. గద్దె ఎక్కించాల్సింది రాజకీయ పార్టీలను కాదు అని.. ప్రజలను అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదని.. ప్రజల జీవితాలు అని పేర్కొన్నారు. ప్రజలే ఎజెండాగా ఫ్రంట్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు కావాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయం కాదని, ప్రత్యామ్నాయ అజెండా అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఇటీవల గాదరి కిషోర్ ఓ వ్యాసం రాశాడని.. అది తనను ఎంతో ఆకట్టుకుందని సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాసం రాసినట్లు ఆయన వివరించారు. తెలంగాణ సాధన కోసం పెట్టిన పార్టీ లక్ష్యాన్ని సాధించిందని.. ఇప్పుడు భారత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే రాజకీయ పార్టీ కావాలి కాబట్టి ఆయన టీఆర్ఎస్ పార్టీ పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చాలని కోరుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
అయితే ఈ దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావించాలని, సందర్భానుసారం స్పందించే గుణం ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దేశంలో తుఫాన్‌ను సృష్టించి దుర్మార్గాలను తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉంటాయన్నారు. అందులో టీఆర్ఎస్ కూడా ఉజ్వలమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. దేశంలో మత చిచ్చు రేపుతున్నారని బీజేపీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని దుర్భాషలాడుతున్నారని.. ఇదా మన సంస్కృతి.. ఇదేనా భారతదేశం అని ప్రశ్నించారు. ఏం ఆశించి బీజేపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. దేశాన్ని ఎటు తీసుకువెళ్తున్నారని నిలదీశారు.
